మతోన్మాదాన్ని ఎదుర్కొందాం


 మతోన్మాదాన్ని సమైక్యంగా ఎదుర్కొందామని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యానికి ప్రమాదకారిగా బిజెపి తయారైందని, ప్రజల మధ్య మత విభజన తీసుకొచ్చి లబ్ధి పొందాలని చూస్తోందని విమర్శించారు. లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో సిఎఎ, ఎన్‌ఆర్‌సి, ఎన్‌పిఆర్‌లకు వ్యతిరేకంగా అనంతపురం నగరంలోని జూనియర్‌ కళాశాల మైదానంలో సోమవారం వేలాదిమందితో జరిగిన బహిరంగ సభలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామిక వ్యవస్థలను బిజెపి ధ్వంసం చేస్తోందన్నారు. పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ) రాజ్యాంగ మౌలిక సూత్రాలకే విరుద్ధమని తెలిపారు. ఢిల్లీ అల్లర్లను ఎండగట్టినందుకు కేంద్ర ప్రభుత్వం కక్షకట్టి కేరళకు చెందిన ఛానళ్లను బ్యాన్‌ చేసిందని విమర్శించారు. భారత స్వాతంత్య్రోద్యోమం నుంచి జాతీయత, లౌకికవాదం అన్నది ప్రజలకు అలవడిందన్నారు. ఇప్పుడు దాన్ని దెబ్బతీస్తోందన్నారు. మతం పేరుతో ప్రజలను విడగొట్టాలనే ప్రయత్నాల్లో భాగంగా సిఎఎ, ఎన్‌ఆర్‌సి, ఎన్‌పిఆర్‌లను తీసుకొచ్చిందన్నారు. దేశ ఆర్థిక పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోందని, నిరుద్యోగం పెరుగుతోందని ఆయన విమర్శించారు. వీటినుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ఇటువంటి ప్రయత్నాలు చేస్తోందన్నారు. కేరళ రాష్ట్రంలో బిజెపి మతోన్మాద ఎత్తుగడలను తిప్పికొట్టేందుకు అన్ని లౌకిక పార్టీలనూ, సంస్థలనూ కలుపుకుని కేరళ ప్రభుత్వం పోరాడుతోందన్నారు. 70 లక్షల మందితో మానవహారాన్ని ఏర్పాటు చేసి ప్రజల మధ్య ఐక్యతను చాటి చెప్పామని తెలిపారు. ఇతర ప్రాంతాల్లోనూ ఇటువంటి ఐక్య పోరాటాలు పెరగాల్సిన అవసరముందన్నారు. పినరయి విజయన్‌ ఆంగ్లంలో ప్రసంగించగా, సిపిఎం ఉత్తర ప్రాంత జిల్లా కార్యదర్శి వి.రాంభూపాల్‌ తెలుగులోకి అనువదించారు. విజయన్‌ ప్రసంగాన్ని ప్రజలు ఆసక్తిగా విన్నారు. బిజెపి విధానాలను ఎండగడుతున్న సమయంలో చప్పట్లతో తమ హర్షాన్ని వ్యక్తం చేశారు. సిపిఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ మాట్లాడుతూ దేశాన్ని మతం పేరుతో విభజించి పాలించాలనే నరేంద్ర మోడీ, అమిత్‌ షాల ఎత్తుగడలను ప్రజలు తిప్పికొడుతారని హెచ్చరించారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసిపి తక్షణం ఎన్‌పిఆర్‌, ఎన్‌ఆర్‌సి అమలు జరపబోమని అసెంబ్లీలో తీర్మానించాలని డిమాండ్‌ చేశారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు మాట్లాడుతూ ఆర్‌ఎస్‌ఎస్‌, విశ్వహిందూ పరిషత్తు పక్కా ప్రణాళికతో ఢిల్లీలో మరణకాండ సాగించి, 53 మందిని ఊచకోత కోశాయని విమర్శించారు. సిఎఎ, ఎన్‌ఆర్‌సి, ఎన్‌పిఆర్‌ విషయంలో రాష్ట్రంలో వైసిపి, టిడిపి నాటకాలు ఆడుతున్నారని ధ్వజమెత్తారు. ఈ రెండు పార్టీలూ కలసి వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో దీనికి వ్యతిరేకంగా తీర్మానం చేయాలని డిమాండ్‌ చేశారు. పిసిసి అధ్యక్షులు సాకే శైలజనాథ్‌ మాట్లాడుతూ అత్యధిక సీట్లు వస్తే ప్రధాని మెడలు వంచి రాష్ట్రానికి అన్నీ సాధిస్తామని చెప్పిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డి, ఇప్పుడు ప్రధాని ముందు మెడ ఎత్తి మాట్లాడలేని పరిస్థితుల్లో ఉన్నారని ఎద్దేవా చేశారు. టిడిపి కూడా బిజెపికి భయపడుతోందన్నారు. కేంద్ర మాజీ మంత్రి, కర్నాటక ఎమ్మెల్సీ ఇబ్రహీం మాట్లాడుతూ దేశంలో ముస్లిములు, హిందువులు కలసిమెలసి కొన్ని శతాబ్దాలుగా జీవనం సాగిస్తున్నారన్నారు. దేశ ప్రజల మధ్య ఐక్యత, పరమత సహనమన్నది అనాదిగా కొనసాగుతోందని తెలిపారు. ఇప్పుడు బిజెపి చిచ్చుపెట్టాలనుకున్నా అది సాధ్యం కాదన్నారు. లౌకిక రాజ్యాంగ పరిరక్షణ కమిటీ రాష్ట్ర కన్వీనర్‌ మౌలనా ముస్తాక్‌ అహమ్మద్‌ మాట్లాడుతూ పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ప్రజల చేస్తోన్న పోరాటం ఆమోఘమైందని పేర్కొన్నారు. శాంతియుతంగా సాగుతున్న ఈ పోరాటం కచ్చితంగా విజయవంతమవుతుందన్నారు. లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక జిల్లా కన్వీనర్‌ చంద్రశేఖర్‌, నాయకులు రషీద్‌ అహ్మద్‌లు అధ్యక్ష వర్గంగా వ్యవహరించారు. మాజీ ఎమ్మెల్సీ డాక్టర్‌ గేయానంద్‌, సిపిఎం రాయలసీమ సబ్‌ కమిటీ కన్వీనర్‌ జి.ఓబుళు, సిపిఐ జిల్లా కార్యదర్శి జగదీశ్‌, సిపిఎం దక్షిణ ప్రాంత కార్యదర్శి ఇంతియాజ్‌, లౌకిక రాజ్యాంగ పరిరక్షణ కమిటీ నాయకులు సాలార్‌బాషా తదితరులు పాల్గొన్నారు.