జగన్ సమక్షంలో చేరిక
మాజీ మంత్రి, శాసనమండలి సభ్యుడు డొక్కా మాణిక్యవరప్రసాదరావు అధికారికంగా వైసీపీ తీర్ధం పుచ్చుకున్నారు. కొన్ని రోజులుగా టీడీపీకి దూరంగా ఉంటున్న ఆయన వైసీపీలో చేరడం ఖాయమనేది ముందుగా ఊహించిన విషయమే అయినా... సోమవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో డొక్కా లాంఛనంగా ఆ పార్టీ కండువా కప్పుకొన్నారు. రాజధాని తరలింపు అంశంపై శాసనమండలిలో ఓటింగ్ జరిగే రోజునే ఆయన సమావేశాలకు హాజరుకాలేదు. డొక్కా వేరే కారణాలు చెప్తున్నప్పటికీ వైసీపీతో కుమ్మక్కు అవ్వడం వల్లే కీలక సమయంలో కాడి కింద పడేశారనే భావనకు టీడీపీ అధిష్ఠానం ఆ రోజునే వచ్చింది. అప్పటి నుంచి టీడీపీకి క్రమంగా దూరమయ్యారు. గత ఎన్నికల్లో ఆయన పోటీ చేసి ఓడిపోయి, ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్న ప్రత్తిపాడు నియోజకవర్గానికి రెండు రోజుల క్రితం కోఆర్డినేటర్‌గా మాజీ మంత్రి మాకినేని పెదరత్తయ్యను నియమించడం ద్వారా డొక్కా తమ పార్టీలో లేడనే సందేశాన్ని టీడీపీ అధిష్ఠానం ఇచ్చింది.
పార్టీలు మారడం కొత్త కాదు
డొక్కా వైసీపీలో చేరికపై జిల్లాలోని టీడీపీ వర్గాలు మండిపడుతున్నాయి. 2014 ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించిన తరువాత మాత్రమే పార్టీలో చేరిన డొక్కాకు ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు కోరకుండానే అనేక పదవులు కల్పించి పెద్ద పీట వేశారు. పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా, కనీసవేతనాల అమలు కమిటీ చైర్మన్‌గా, ఆ తరువాత శాసనమండలిలోకి అడుగు పెట్టే అవకాశాన్ని ఇవ్వడమే కాకుండా విప్ హోదాను కూడా కల్పించారు. ఎమ్మెల్సీగా కొనసాగుతున్న సమయంలోనే ప్రత్తిపాడు ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం కల్పించగా వైసీపీ ప్రభంజనంలో ఆయన ఓటమిపాలయ్యారు. కాగా సుదీర్ఘకాలం కాంగ్రె్‌సలో కొనసాగి, ఆ తరువాత టీడీపీలోకి వచ్చి... ఇప్పుడు వైసీపీ గూటికి చేరిన డొక్కాకు పార్టీలు మారడం కొత్త కాదనే విషయం రుజువైందని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య వ్యాఖ్యానించారు. మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ఏ పార్టీ కూడా శాశ్వత రాజకీయ వేదిక కాదనే విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారని, దానిని బట్టే ఆయన భవిష్యత్తులో ఇంకో పార్టీలోకి వెళతాడని స్పష్టంగా అర్థమవుతోందని అన్నారు.