యాదృచ్ఛికమేనా?


క్రికెట్‌ మైదానంలో మరణించిన క్రికెటర్ కనకయ్య’పేపర్లో వార్త పైకి చదివాడు అసిస్టెంట్‌ రాము.‘‘ఎలా మరణించాడు?’’ పుస్తకంలోంచి తలెత్తి అడిగాడు డిటెక్టివ్‌ శరత్‌.‘‘బ్యాట్స్‌మన్‌ వేగంగా కొట్టిన బంతి ఫీల్డర్‌ కనకయ్య కణతలకు తగిలి అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు’’ చెప్పాడు రాము.


ఇంతలో సెక్రటరీ సుధ లోపలకు వచ్చి, ‘‘బాస్‌ రమణయ్యట, మిమ్మల్ని కలవాలంటున్నారు, అతని తమ్ముడు కనకయ్య హత్య గురించి మాట్లాడాలట’’.‘రమ్మను’ అన్నాడు శరత్‌.మూర్తీభవించిన విషాదంలా ఉన్నాడు రమణయ్య. శరత్‌ ఎదుట కూర్చున్నాడు.‘‘క్రికెటర్‌ కనకయ్య నా తమ్ముడు. రాబర్ట్‌ కొట్టిన బంతి తలకు తగిలి అక్కడికక్కడే మరణించాడు’’. చెప్పాడు.‘‘ఇప్పుడే పత్రికలో చదివాను’’‘‘అది యాదృచ్ఛికం కాదు, పథకం ప్రకారం జరిగింది!’’కనుబొమ్మ ఎగరేశాడు శరత్‌.‘‘నాలుగైదు నెలలుగా నా తమ్ముడిమీద హత్యాప్రయత్నాలు జరుగుతున్నాయి. దైవికంగా తప్పించుకుంటున్నాడు. ఈసారి తప్పించుకోలేకపోయాడు’’ రమణయ్య కన్నీళ్ళు పెట్టుకున్నాడు.‘‘హత్య అని ఎలా చెప్తారు?’’‘‘నాలుగునెలలక్రితం బరోడాలో మ్యాచ్‌కి వెళ్లినప్పుడు, మరో క్రికెటర్‌తో కలిసి కార్లో వెళ్తూంటే లారీ వెంటాడి ఢీకొట్టి కారును నుజ్జునుజ్జు చేసింది.


స్వల్పగాయాలతో ఇద్దరూ బయటపడ్డారు. కలకత్తాలో మ్యాచ్‌ ఆడే రోజు పుడ్‌ పాయిజనింగ్‌ జరిగింది. అదే ఐటమ్‌ తిన్న మిగతావారంతా బాగానే ఉన్నారు. సకాలంలో ట్రీట్‌మెంట్‌తో బయటపడ్డాడు. ఢిల్లీలో మ్యాచ్‌కి ముందురోజు ప్రాక్టీసులో బంతి తలకు తగిలింది. అంతకుముందు ఫ్రెండ్లీమ్యాచ్‌లో బ్యాట్స్‌మెన్‌ కొట్టిన బంతి కంటిపైన తగిలి కుట్లుపడ్డాయి. ఇవన్నీ యాధృచ్చికం అనిపించటంలేదు. నిజానిజాలు మీరే తేల్చాలి’’ కన్నీళ్ళతో ప్రాధేయపడ్డాడు రమణయ్య. రాము వైపు చూశాడు శరత్‌. రాము తల ఊపాడు.‘సరే. మీరు వివరాలన్నీ రాముకి ఇవ్వండి, పరిశోధిస్తాం’’ అన్నాడు శరత్‌.



‘‘బాస్‌, రమణయ్య చెప్పినవన్నీ నిజాలే. అయితే పథకం ప్రకారం చేశారనలేం. ఒకరు బౌలర్‌ బౌన్సర్లు వేయవచ్చు. బ్యాట్స్‌మెన్‌ ఎటైనా కొట్టవచ్చు’’ శరత్‌కి వివరించాడు రాము.‘‘మరి లారీ డీకొట్టడం ఏమిటి?’’ అడిగాడు శరత్‌.‘‘అది డౌటే. అంతకుముందు ఇంట్లోంచి ప్రాక్టీసుకి వెళ్తుంటే, ఎవరో మోటార్‌ సైకిల్‌ మీద వచ్చి డాష్‌ ఇవ్వబోతే చాకచక్యంగా తప్పించుకున్నాడట. కనకయ్య తోటి ఆటగాడు తన్వీర్‌ చెప్పాడు’’కుర్చీలో వెనక్కువాలేడు శరత్‌.‘‘మరి కనకయ్య కుటుంబ నేపథ్యం, అతని కెరీర్‌, అతడి స్నేహితులు, శత్రువులు, ఫోన్‌ నంబర్లన్నీ సేకరించావా?’’‘‘సేకరించాను, ఇవిగో’’ అని అందించాడు రాము.‘కనకయ్య మ్యాచ్‌ అడినప్పటి వీడియోలన్నీ సేకరించు, ఎవరైనా సెల్‌ఫోన్స్‌లో రికార్డు చేసినవీ, ప్రెస్‌ రిపోర్ట్‌లు కూడా సేకరించు’’ చెప్పాడు శరత్‌. ‘‘ఓకే బాస్‌’’ అన్నాడు రాము. 


క్రికెట్‌ గురించిన ప్రెస్‌ రిపోర్టులు, వార్తలు చదువుతుంటే శరత్‌కి క్రికెట్‌ రాజకీయాలు అర్థమవసాగాయి. టాలెంట్‌ ఒక్కటే సరిపోదని స్పష్టంగా తెలుస్తోంది. అన్ని పాయింట్లూ నోట్‌చేసుకున్నాడు. ఎవరెవరిని ప్రశ్నించాలో రాసుకున్నాడు. కనకయ్యకు మొదట కోచింగ్‌ ఇచ్చిన మల్లికార్జున్‌ని కలిశాడు.‘‘చాలా టాలెంటెడ్‌ ఆటగాడు. కానీ పేదవాడు, బ్యాట్‌, ప్యాడ్‌ నేనే కొనిచ్చాను. టాలెంట్‌ వల్లే పైకి వచ్చాడు’’ చెప్పాడు మల్లికార్జున్‌.‘‘కానీ అతడిని క్లబ్‌ టీమ్‌లో సెలక్ట్‌ చేయటం కూడా కష్టమైందని విన్నాను’’ అడిగాడు శరత్‌.‘‘సెలక్టర్లకు సొంత ప్రయారిటీలుంటాయి. వాళ్లు ఎంపికచేసినా, ఆట ఆడేరోజున కోచ్‌, మేనేజర్లు టీమ్‌ని నిర్ణయిస్తారు. నేనే ఒత్తిడిచేసి, రెండుమూడుసార్లు జట్టులోకి ఎంపిక చేయించాను.


అంటే జట్టులో 16మంది ఉంటారు. ఆడే 11మంది కాక మిగిలినవాళ్ళు బెంచీమీద రెడీగా ఉంటారు. కానీ తరువాత అందులోంచి కూడా తీసేశారు’’‘‘మరి జట్టులోకి ఎలా వచ్చాడు?’’‘నేను అతడిని అస్సాం పంపించాను. అక్కడ జట్టు ఎంపికలో ప్రముఖులు, రాజకీయ నాయకులు జోక్యం తక్కువ. అక్కడ బాగా అడి రాణించి, రంజీ జట్టులోకి వచ్చి, నేషనల్‌ సెలెక్టర్స్‌ దృష్టిలో పడ్డాడు. ప్రతిభకు అదృష్టంతోడైతేనే విజయం లభిస్తుంది’’ విచారంగా అన్నాడు మల్లికార్జున్‌.‘‘కనకయ్యది హత్య అంటున్నారు, మీరేమంటారు?’’ అడిగాడు శరత్‌.‘‘అతడు అస్సాం వెళ్ళాక నాతో టచ్‌లో లేడు’’.


‘నేను గమనించినంతవరకూ అతడికీ మల్హోత్రాకు మధ్య రైవల్రీ ఉందనిపిస్తుంది’’ అన్నాడు శరత్‌.‘‘సారీ, నాకు తెలియదు’’ అన్నాడు మల్లికార్జున్‌. తరువాత శరత్‌ ఏం అడిగినా మౌనంగా ఉండిపోయాడు. ‘‘నిజమే. కనకయ్య, మల్హోత్రా మంచి బ్యాట్స్‌మన్లు. వాళ్ళమధ్య పోటీ ఉండేది’ కాఫీ చప్పరిస్తూ అన్నాడు కక్కర్‌. సెలెక్టర్లకు విమర్శించి కేరీర్‌ను పాడుచేసుకున్న క్రికెటర్‌ ఈ కక్కర్‌.‘‘జట్టులో నలుగురు బ్యాట్స్‌మెన్‌లు స్ధిరంగా ఉన్నారు. ఒకే బ్యాట్స్‌మెన్‌కి జాగా ఉంది. విచిత్రం ఇద్దరూ ‘వన్‌డౌన్‌’ బ్యాట్స్‌మన్‌లే. అయితే, మల్హోత్రా తండ్రి పరపతిగల మాజీ క్రికెటర్‌ కావడంవల్ల, మల్హోత్రాను ఎంపిక చేసేవారు. అతడు ఓ యాభై రన్స్‌ కొడితే చాలు, మళ్లీ ఐదారు ఆటలకి ఢోకా ఉండేదికాదు. కనకయ్యకు ఎప్పుడూ ఎదురుచూపులే మిగిలేవి. ఒకసారి మల్హోత్ర గాయపడినప్పుడు వచ్చిన అవకాశాన్ని కనకయ్య పూర్తిగా వినియోగించుకుని, డబుల్‌ సెంచరీ చేశాడు. 


అప్పటినుంచీ కనకయ్య సరిగ్గా ఆడకపోతే తీసేద్దామని సెలక్టర్లు ఎదురుచూస్తున్నారు. కానీ కనకయ్య ప్రతి ఆటలోనూ తన ప్రతిభ నిరూపించకున్నాడు’’.‘‘కానీ ఒకసారి, ఫుడ్‌ పాయిజనింగ్‌వల్ల, దెబ్బ తగలటంవల్ల మల్హోత్రాకు అవకాశం ఇచ్చారు కదా?’’ అడిగాడు శరత్‌.‘‘ఇచ్చారు. అతడు సరిగ్గా ఆడలేదు. దాంతో కనకయ్యకు ఫిట్‌నెస్‌ రాగానే మల్హోత్రాను తొలగించి కనకయ్యకు అవకాశం ఇవ్వాల్సి వచ్చింది. కనకయ్యకు ఫిట్‌నెస్‌ ఉన్నాగానీ అవకాశం ఇవ్వని ఒకమ్యాచ్‌ ఓడిపోయినప్పుడు పెద్దగోల జరిగి మళ్లీ కనకయ్యను తీసుకోవాల్సివచ్చింది’’ చెబుతున్నాడు కక్కర్‌.‘‘అంటే మల్హోత్రాకి కనకయ్యే అడ్డుగా ఉన్నాడన్నమాట’’ క్లారిటీకోసం అడిగాడు శరత్‌.‘‘అలాగే అనిపిస్తోంది’’ అన్నాడు కక్కర్‌. ‘‘బాస్‌, కక్కర్‌ చెప్పింది నిజమే.


మల్హోత్ర స్వీయవైఫల్యాలతో, కనకయ్యపై కసి పెంచుకున్నాడు. పెవిలియన్‌లో వాళ్ళమధ్య వాదనలు కూడా జరిగాయట. మల్హోత్ర పన్నెండవ ఆటగాడిగా ఉన్నప్పుడు కనకయ్యకు నీళ్ళు అందించటం, బ్యాట్‌ తీసుకెళ్ళి ఇవ్వటం వంటి పనులు చేసేవాడు కాదట’’ తను సేకరించిన సమాచారం చెప్పాడు రాము.‘‘రామూ, మల్హోత్ర బ్యాంకు ఎకౌంట్‌ వివరాలు సేకరించు. అలాగే ప్రాక్టీస్‌లో ఎవరి బౌలింగ్‌లో కనకయ్య గాయపడ్డాడో, ఎవరి బ్యాటింగ్‌లో దెబ్బలు తగిలాయో వాళ్లతో మాట్లాడు. వాళ్ల బ్యాంకు లావాదేవీలు కూడా సేకరించు’’ చెప్పాడు శరత్‌.


‘‘బాస్‌, అల్రెడీ నేను మాట్లాడాను. మల్హోత్ర, కనకయ్య మధ్య వైషమ్యాలు జట్టులో అందరికీ తెలుసు. కనకయ్యమీద అందరికీ సానుభూతి ఉంది. కానీ మల్హోత్రా తండ్రిని చూసి భయపడి, అందరూ మల్హోత్రాకే మద్దతు ఇచ్చేవారట. కనకయ్య బ్యాటింగ్‌ చేస్తుంటే, ఏదో ఒకరకంగా అతడిని రనౌట్‌ చేయాలని ప్రయత్నించేవారట. అందుకే ఎవరిని అడిగినా బంతి తలకు తగలడం ‘ఏక్సిడెంటల్‌’ అంటున్నారు’’ వివరించాడు రాము.‘‘సరే, అయితే, ఆటగాళ్లందరి బ్యాంకు వివరాలు సేకరించు’’ అన్నాడు శరత్‌ ఆలోచిస్తూ. ప్రజల నీరాజనాలు అందుకుంటున్న ఆటగాడు, కానీ జట్టులో మాత్రం ఒంటరి’’ అనిఆలోచిస్తూ, కనకయ్య ఆటల వీడియోలు చూడటం ఆరంభించాడు శరత్‌. ప్రతి ఆటలో కనకయ్య ఇద్దరు ప్రత్యర్థులను ఎదుర్కోవాల్సి వస్తోంది. ఒకటి ప్రత్యర్థి జట్టు. రెండవది తన జట్టులోవాడే. 


కనకయ్య ఆడినంతసేపూ అతడిని రనౌట్‌ చేయాలని ప్రయత్నించటం క్లియర్‌గా తెలుస్తోంది. కనకయ్య బంతిని కొట్టి పరుగుతీసే అవకాశం ఉండి పరుగుకు పిలిచినా సగం దూరం వచ్చి వెనక్కు వెళ్ళిపోవటం, కనకయ్య పిచ్‌ సగంలో అమాయకంగా నిలబడటం తెలుస్తోంది. శరత్‌కు జాలి అనిపించింది.కనకయ్య మంచి ఫీల్డర్‌ కానీ, బంతి కుడివైపు నుంచి వస్తే సరిగా ఆపలేకపోతున్నాడని శరత్‌ గమనించాడు. ఎడమవైపు బంతిని తనని దాటిపోనీయడు. బ్యాటింగ్‌లో లేని సమస్య ఫీల్డింగ్‌లో వస్తోంది. జాగ్రత్తగా ఫీల్డింగ్‌ని గమనించటం ప్రారంభించాడు శరత్‌.రాబర్ట్‌ కొట్టిన బంతి కుడివైపు నుంచి వస్తోంది!అంతేకాదు,అతడిని అదే పొజిషన్‌లో ఫీల్డింగ్‌కి నిలబెడుతున్నాడు కెప్టెన్‌ శంభార్కర్‌.ఫలితం క్యాచులు వదిలేశాడు, బౌండరీలు పోనిచ్చేవాడు కనకయ్య.


బంతి అతడి భుజానికి తగిలేది, పొట్టలో తగిలేది, శంభార్కర్‌ గురించి రాము అందించిన వివరాలు చదివాడు శరత్‌.‘రాము... కనకయ్య ఏ కంటి డాక్టర్‌ దగ్గరకు వెళ్లేవాడో తెలుసుకో’ అన్నాడు శరత్‌. ‘‘కనకయ్యకు Amblyopiaఉంది. దీన్ని మామూలుగా ‘లేజీ రె’ అంటారు. దీన్ని మామూలు కంటి పరీక్షలు గుర్తుపట్టలేవు. ఫంక్షనల్‌ ఐ టెస్ట్‌ చేయాలి. విజన్‌ థెరపీతో పాటు మెదడుకు కూడా శిక్షణ ఇవ్వాలి. కనకయ్య క్రమం తప్పకుండా ఈ శిక్షణ తీసుకునేవాడు. టూర్లువల్ల ఒక సెషన్‌ మిస్‌ అయ్యాడు. మీరు ఊహించింది కరెక్టే’’ అన్నాడు కంటి డాక్టర్‌.


‘‘మరి బ్యాటింగ్‌ ఎలా చేసేవాడు?’’‘‘మీకు తెలుసా? మన్సూర్‌ అలీఖాన్‌ పటౌడీ అనే ఆటగాడు ఒంటికన్నుతో వందల పరుగులు చేశాడు. ఒక ఆటలో అతడికి ఒక కాలు, ఒక కన్ను పనిచేయకపోయినా, రెండు ఇన్నింగ్సులో 50 పరుగుల పైన చేశాడు. ప్రతిభకు ఇచ్ఛాశక్తి తోడైతే సాధించలేనది లేదు’’ అన్నాడు.తల ఊపాడు శరత్‌ ఆలోచిస్తూ. శరత్‌ ప్రశ్న విని శంభార్కర్‌ పెద్దగా నవ్వాడు. మల్హోత్ర అతడి భుజం చరిచాడు.‘‘బంతిని వేగంగా కొట్టింది మేమెవ్వరం కాదు. విదేశీ ఆటగాడు. అతడు కావాలని కొట్టినట్టు మీరు నిరూపించాలి. జరిగింది యాదృచ్ఛికం. మా ప్రమేయం లేదు. టీమ్‌ మీటింగ్‌లో కోచ్‌, కెప్టెన్‌, వైస్‌ కెప్టెన్‌లు కలిసి చర్చించి, ఎవరు ఏ పొజిషన్‌లో ఫీల్డింగ్‌ చేయాలో నిర్ణయిస్తారుతప్ప నిర్ణయం కెప్టెన్ ఒక్కడిదీ కాదు. 


మైదానంలో బౌలర్‌ అభిప్రాయం పరిగణనలోకి తీసుకుని ఫీల్డ్‌ ప్లేస్‌మెంట్లు జరుగుతాయి’’ చెప్పాడు మల్హోత్ర. ‘‘ఇదీ పరిస్థితి. అందరూ కలిసి చేసినకుట్ర. వాళ్ళు చెయ్యాల్సింది చేశారు. కానీ బంతి తగలటం యాధృచ్ఛికం. అలా తగిలేవరకు అందరూ ఎదురుచూశారు’’ కనకయ్య అన్న రమణయ్యకు వివరించాడు శరత్‌.‘‘పోన్లెండి. ఎవరి పాపాన వారే పోతారు. ఆ దేవుడే అన్నీ చూసుకుంటాడు. కానీ మీరు ఈ తాజా వార్త విన్నారా?’’ అన్నాడు రమణయ్య.‘‘ఏమిటి?’’ ప్రశ్నించాడు శరత్‌.‘‘మల్హోత్ర మెట్లు దిగుతూ క్రిందపడ్డాడు. కాలు విరిగింది. అతని బదులు పదహారేళ్ల దీపక్‌ని జట్టులోకి తీసుకున్నారు, అతడు ట్రిపుల్‌ సెంచరీ చేశాడు’’ సంతోషంగా నవ్వుతూ చెప్పాడు రమణయ్య