ఎక్సైజ్, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష
గ్రామాల సమగ్రాభివద్ధిలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలంటే బెల్టుషాపులు ఉండకూడదని, మద్యం అక్రమ తయారీ, ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో గురువారం ఎన్‌ఫోర్స్‌మెంట్, ఎక్సైజ్‌శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇసుక అక్రమ తవ్వకాలు, అక్రమ రవాణా, బెల్టుషాపులు, మద్యం అక్రమ తయారీ నిరోధించడానికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు. గ్రామాల స్వరూపాన్ని మార్చడానికి గ్రామ సచివాలయం, వైఎస్‌ఆర్ రైతు భరోసా కేంద్రాలు, వైఎస్‌ఆర్ విలేజ్ క్లినిక్‌లు, ఇంగ్లీషు మీడియంలో విద్యాబోధన తదితర మార్పులు తీసుకొస్తున్నామని తెలిపారు. రాష్ట్ర సరిహద్దుల్లో ఇసుక, మద్యం అక్రమ రవాణా ఉండకూడదన్నారు. ఇలాంటి ఘటనలపై పోలీసులు, ఎన్‌ఫోర్స్‌మెంట్, ప్రొహిబిషన్ సిబ్బంది కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు.
బెల్టుషాపుల నిరోధమే లక్ష్యంగా 11 వేల మంది మహిళా పోలీసులను నియమించామని పేర్కొన్నారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగంలో సిబ్బందిని పెంచాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖలో ఉన్న మూడింట రెండొంతుల మంది సిబ్బందిని ఎన్‌ఫోర్స్‌మెంట్ పనుల కోసం వినియోగించాలన్నారు. సమావేశంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సిఎస్ నీలం సహాని, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.