31 వరకు ఏపీలోనూ లాక్‌డౌన్‌

పదో తరగతి పరీక్షలు యథాతథం



అమరావతి: కరోనా వ్యాప్తిని అరికట్టాలంటే ఐసోలేషన్‌ ఒక్కటే మార్గమని, ఎవరూ తిరగకుండా, ఎవరున్న చోట వారు ఉండగలిగితేనే దీన్ని కట్టడి చేయగలమని సీఎం జగన్‌ అన్నారు. ఇప్పటికే 12 రాష్ట్రాలు అంతర్రాష్ట్ర సరిహద్దులను మూసివేశాయని.. మనం కూడా అంతర్రాష్ట్ర సరిహద్దులను మూసివేస్తున్నామని ప్రకటించారు. ఈ నెల 31 వరకు రాష్ట్రంలోనూ లాక్‌డౌన్‌ చేయాలని నిర్ణయించామని తెలిపారు. ప్రజా రవాణాను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. అత్యవసర వాహనాలకు మాత్రమే అనుమతిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు జగన్‌ మీడియాతో మాట్లాడారు.


అవసరమైతేనే ప్రజలు బయటకు రావాలని సీఎం జగన్‌ సూచించారు. ‘‘పదో తరగతి, ఇతర పరీక్షలు యథాతథంగా నిర్వహించాలని నిర్ణయించాం. అన్ని జాగ్రత్తలూ తీసుకున్నాకే పరీక్షలు నిర్వహిస్తాం. నిత్యావసరాలు విక్రయించే దుకాణాలు పూర్తిగా అందుబాటులో ఉంటాయి. వ్యాపారులెవరైనా అధిక ధరలకు నిత్యావసరాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. ధరలు పెరగకుండా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలి. 10 మందికి మించి ప్రజలెవరూ గుమిగూడొద్దు. కరోనా వ్యాప్తి నివారణకు ప్రజలంతా సహకరించాలి. విదేశాల నుంచి వచ్చిన వారంతా 14 రోజుల పాటు ఇళ్ల నుంచి బయటకు రాకూడదు. అలాంటి వారిపై పోలీసులు నిఘా పెట్టాలి. త్వరలోనే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి బడ్జెట్‌ను ఆమోదిస్తాం. అవి కూడా తక్కువ రోజులే నిర్వస్తాం’’ అని సీఎం వివరించారు.