దేశంలో 138 మందికి


ముంబైవాసి మృతి.. మహారాష్ట్రలో 41 మందికి!.. బాధితుల్లో మూడేళ్ల చిన్నారి


బెంగాల్‌, పుదుచ్చేరిలలో తొలి కేసులు.. కలబుర్గి మృతుడి డాక్టర్‌కూ పాజిటివ్‌


అఫ్ఘానిస్థాన్‌, ఫిలిప్పీన్స్‌, మలేసియా నుంచి వచ్చేవారికి దేశంలోకి ప్రవేశం నిషిద్ధం


ఇరాన్‌లో 254 మంది భారతీయులకు వ్యాధి?.. లక్షల్లో మృతులు: ఇరాన్‌ వార్నింగ్‌


85,000 మంది ఖైదీల విడుదల.. విలవిలలాడుతున్న స్పెయిన్‌, ఇటలీ, బ్రిటన్‌


కౌలాలంపూర్‌లో చిక్కిన 300 మంది తెలుగు విద్యార్థులు.. ఎట్టకేలకు భారత్‌కు


23 రైళ్లను రద్దు చేసిన సెంట్రల్‌ రైల్వే


న్యూఢిల్లీ, మార్చి 17: దేశంలో కరోనా కేసుల సంఖ్య 137కు.. ఆ వైరస్‌ కారణంగా చనిపోయినవారి సంఖ్య 3కు చేరింది. తెలంగాణలో ఐదో పాజిటివ్‌ కేసు నమోదైంది. మతకార్యక్రమం నిమిత్తం ఇండోనేషియా నుంచి వచ్చిన 58 ఏళ్ల వ్యక్తికి కరోనా సోకింది. మహారాష్ట్రలో రోజురోజుకూ బాధితుల సంఖ్య పెరుగుతోంది. సోమవారం కొత్తగా ఇద్దరికి వైరస్‌ సోకడంతో మహారాష్ట్రలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 41కి చేరింది. ఆ ఇద్దరూ అమెరికా నుంచి ఈ నెలలోనే భారత్‌కు వచ్చారని అధికారులు తెలిపారు. ఇక, దేశంలో కరోనా కారణంగా మరణించిన మూడో వ్యక్తి మహారాష్ట్రవాసే. కొద్దిరోజుల క్రితం దుబాయ్‌ నుంచి వచ్చిన ముంబై వృద్ధుడికి (64) వైరస్‌ సోకింది. ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారంనాడు మరణించారు. అయితే, ఆయన మరణానికి కొవిడ్‌ ఒక్కటే కారణం కాదని.. బీపీ, న్యూమోనియాతో ఆయన బాధపడుతున్నారని బృహన్ముంబై మునిసిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ ప్రవీణ్‌ పర్దేశి తెలిపారు. కరోనా పాజిటివ్‌గా తేలిన ఆ వృద్ఢుడి భార్య కూడా ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమె పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. దేశంలోనే కరోనా సోకిన అతిపిన్న వయస్కురాలు.. మహారాష్ట్రకు చెందిన మూడేళ్ల చిన్నారి. తొలుత ఆ పాప తండ్రికి వైరస్‌ పాజిటివ్‌ వచ్చింది. ఆయన నుంచి భార్యకు, ఆ చిన్నారికి కూడా వైరస్‌ సోకింది. వైరస్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో.. 15 రోజులపాటు ప్రజలంతా స్వీయ క్రమశిక్షణ పాటించాలని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే పిలుపునిచ్చారు. ఉద్యోగులకు ఇంటి నుంచి పని చేసే అవకాశాన్ని కల్పించాలని ప్రైవేటు కంపెనీలకు ఆదేశాలు జారీ చేశారు. ఆలయాల మూసివేతకు ఆదేశాలిచ్చారు.


 


దేశంలో ఇప్పటివరకూ ఈ వైరస్‌ బారినపడిన 137 మందిలో 24 మంది విదేశీయులు. హరియాణాలో 15 మందికి వైరస్‌ సోకగా.. వారిలో 14 మంది విదేశీయులే. తొలిసారి ఆ రాష్ట్రానికి చెందిన 29 ఏళ్ల మహిళకు వైరస్‌ పాజిటివ్‌ వచ్చింది. ఆమెకు కూడా ఉద్యోగరీత్యా ఇటీవలే ఇండోనేషియా, మలేషియా వెళ్లొచ్చిన చరిత్ర ఉందని అధికారులు తెలిపారు. అలాగే.. కరోనా బారిన పడి ఆస్పత్రుల్లో సమర్థమైన చికిత్సతో నయమై ఇళ్లకు చేరుకున్నవారి సంఖ్య 14. ఇప్పటిదాకా ఒక్క కరోనా పాజిటివ్‌ కేసు కూడా లేని బెంగాల్‌, పుదుచ్చేరిలోనూ వైరస్‌ సోకింది. మార్చి 13న సౌదీ నుంచి ఆమె భారత్‌కు వచ్చారని అధికారులు తెలిపారు. కాగా.. హైదరాబాద్‌లో మరణించిన కలబుర్గివాసికి తొలుత కర్ణాటకలో చికిత్స చేసిన వైద్యుడికి (63) కరోనా పాజిటివ్‌ వచ్చింది. అ లాగే.. యూకే నుంచి వచ్చిన 20 ఏళ్ల మహిళకు, అమెరికా నుంచి వచ్చిన 67 ఏళ్ల వృద్ధురాలికీ వైరస్‌ సోకడంతో కర్ణాటకలో బాధితుల సంఖ్య 11కు చేరింది. ఇట లీ నుంచి ఇటీవల ప్రత్యేక విమానంలో తరలించి ఢిల్లీ సమీపంలోని ఐటీబీపీ క్వారంటైన్‌లో ఉంచినవారిలో ఇద్దరికి పాజిటివ్‌ వచ్చినట్టు అధికారులు తెలిపారు. 


 


ఎంపీలూ.. మీరు కూడా..


కరోనాపై అవగాహన కల్పించాలని బీజేపీ ఎంపీలకు ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. కరోనా నేపథ్యంలో సేవలందిస్తున్న వైద్యులు, వైద్య సిబ్బందిని ప్రశంసించారు. మీడియాను కూడా అభినందించారు. దేశంలో ఇప్పటివరకూ కరోనా పాజిటివ్‌గా తేలినవారితో సన్నిహితంగా మెలిగిన 54 వేల మందిని గుర్తించామని.. వారిని పరిశీలనలో ఉంచామని కేంద్ర మంత్రి హర్షవర్ధన్‌ రాజ్యసభలో తెలిపారు. గ్రామాల నుంచి పట్టణాల దాకా అన్ని చోట్లా కరోనా కట్టడికి కృషిచేస్తున్న వైద్యులను ఆయన కొనియాడారు. ఎంపీలంతా తమతమ నియోజకవర్గాల్లోని క్వారంటైన్‌ కేంద్రాలను సందర్శించి క్షేత్రస్థాయి వివరాలు తెలపడం ద్వారా ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. వైర్‌సను నియంత్రించేందుకు రెట్రోవైరల్‌ డ్రగ్స్‌ను వినియోగిస్తున్నట్టు మంత్రి వివరించారు. కాగా.. కరోనా కట్టడిలో రాష్ట్రప్రభుత్వాలకు సహకరించేందుకు సంయుక్త కార్యదర్శి, ఆపై ర్యాంకుల అధికారులు 30 మందిని కేంద్రం నియోగించింది. ఆఫ్గనిస్థాన్‌, మలేసియా, ఫిలిప్పీన్స్‌ దేశాల నుంచి వచ్చేవారికి మనదేశంలోకి ప్రవేశాన్ని నిషేధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాగా, గుర్తింపు పొందిన ప్రైవేటు ల్యాబ్‌ల్లోనూ కరోనా పరీక్షలు జరిపేందుకు అనుమతి ఇవ్వాలని కేంద్ర ఆరోగ్య శాఖ నిర్ణయించింది. ఆ శాఖలోని విశ్వసనీయవర్గాల సమాచారం మేరకు.. దేశవ్యాప్తంగా 60 ప్రైవేటు ల్యాబ్‌లకు త్వరలోనే ఈ అనుమతులు ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఐసీఎంఆర్‌ నేతృత్వంలోని ప్రయోగశాలల్లో పరీక్షలు చేస్తున్నారు.