రాష్ట్రంలో ఈ నెలలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఈ నెల 12న తమ పార్టీ మేనిఫెస్టో విడుదల చేయనున్నట్లు బీజేపీ- జనసేననాయకులు ప్రకటించారు. విజయవాడలో ఇరు పార్టీల ముఖ్య నాయకులు సమావేశమై స్థానిక ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై సుమారు రెండు గంటల పాటు చర్చించారు. సమావేశం అనంతరం బీజేపీనాయకురాలు పురందేశ్వరి, జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడారు.
జిల్లా, అసెంబ్లీ, మండల స్థాయిలో ఇరు పార్టీ మధ్య సమన్వయ కమిటీలు ఏర్పాటు చేయనున్నట్లు వారు వెల్లడించారు. వైసీపీ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని.. ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని పురందేశ్వరి చెప్పారు. ప్రతిపక్షాలను దెబ్బతీసేందుకే ఇంత తక్కువ సమయంలో ఎన్నికలు నిర్వహిస్తున్నారని ఆమె ఆక్షేపించారు. నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ ఇరు పార్టీల పొత్తుతో రాష్ట్రంలోని అన్ని స్థానాల్లోనూ పోటీ చేస్తామని చెప్పారు. ప్రజలు వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకుని ఓట్లు వేయాలని ఆయన కోరారు.