పంచతంత్ర కథలు


బాటసారి కథ 


అనగనగా ఒక అడవి. ఆ అడవిలో ఓ మర్రిచెట్టు. ఆ చెట్టు మీద ఎన్నో...ఎన్నెన్నో పక్షులు ఉంటున్నాయి. ఆ పక్షుల్లో ఓ కాకి కూడా ఉంది. దాని పేరు లఘుపతనకం. అదలా ఉండగా...ఒక రోజు తెల్లవారు జామునే వేటగాడొకడు అడవిలో నూకలు చల్లి, వాటిపై వలపన్నాడు. వలపన్ని చెట్టు చాటుగా దాక్కున్నాడు. తెల్లగా తెల్లారింది. పావురాలు కొన్ని ఆకాశంలో ఎగురుతూ కింద భూమి మీది నూకల్ని చూశాయి. ఆకలనిపించింది వాటికి. తినాలని ఆశపడ్డాయి. కిందికి గుంపుగా దిగసాగాయి.‘‘ఎక్కడికి’’ అడిగాడు చిత్రగ్రీవుడు. అతను ఆ పావురాల రాజు.‘‘కింద నూకలున్నాయి. తిందాం’’ అన్నాయి పావురాలు.‘‘ఆగండాగండి’’ హెచ్చరించాడు చిత్రగ్రీవుడు. ఆగాయి పావురాలు.‘‘తొందరపడవద్దు! మనుషులే కనిపించని ఈ అడవిలో నూకలు ఎక్కణ్ణుంచి వస్తాయి? ఇందులో ఏదో మోసం ఉంది. వద్దు! మనం ఆ నూకల కోసం ఆశపడవద్దు’’ అన్నాడు చిత్రగ్రీవుడు.‘‘ఇలా ఆశపడే పూర్వకాలంలో ఒక బాటసారి పులి నోటికి చిక్కి మరణించాడు’’ అన్నాడు.‘‘అలాగా’’ ఆశ్చర్యపోయాయి పావురాలు.‘‘అవును! మీకు ఆ కథ చెబుతాను వినండి’’ అంటూ కథ చెప్పసాగాడు చిత్రగ్రీవుడు.ఓ పెద్ద చెరువు ఉంది. ఆ చెరువు గట్టున ఓ పొద ఉంది. ఆ పొదలో ముసలి పులి ఒకటి నివసిస్తోంది. గట్టు మీద నుంచి ఓ బాటసారి పోతున్నాడు. అతన్ని చూసింది పులి.‘‘ఇదిగో’’ అని కేకేసింది.పిలుస్తున్నది ఎవరా? అని చూశాడు బాటసారి. పులి పిలుస్తోంది. భయపడ్డాడతను.‘‘భయపడకు! చూశావా, నా చేతిలోని బంగారు కడియం. దీనిని నీలాంటి పుణ్యాత్ముడికి ఇవ్వాలని కోరిగ్గా ఉంది. అందుకే పిలిచాను. చెరువులో స్నానం చేసి, శుచిగా రా! ఈ బంగారు కడియాన్ని తీసుకో’’ అంది పులి. బంగారు కడియాన్ని వేళ్ళ మధ్య ఉంచి ఆడించసాగింది. బాటసారి కడియాన్ని చూశాడు. బాగుందది. మెరుస్తోంది. మంచి బంగారమే! అనుమానం లేదు. అయితే కడియం కోసం పులిని నమ్మి దగ్గరగా వెళ్తే ఇంకేమయినా ఉందా? తనని తినేయదూ అనుకున్నాడు.


అయినా బంగారాన్ని వదులుకోలేక పోతున్నాడు. ఓ పక్క ప్రాణం, మరో పక్క బంగారం. ఏం చేయాలో అంతుచిక్కట్లేదు బాటసారికి. ఆ అంతుచిక్కని స్థితిలోనే పులితో ఇలా అన్నాడు బాటసారి.‘‘నువ్వేమో క్రూరజంతువ్వి. నేనేమో మనిషిని. నీ దగ్గరకు రావాలంటేనే భయంగా ఉంది.నిన్నెలా నమ్మను చెప్పు?’’అతనికి ఆశను కల్పిస్తున్నట్టుగా కడియాన్ని గాలిలోకి ఎగరేసి అందుకుంది పులి.‘‘బంగారం కోసం ప్రాణాన్ని పణం పెట్టలేను. నీ దగ్గరకి రాను, రాలేను’’ అన్నాడు.‘‘నువ్వన్నది నిజమే! నేను క్రూరజంతువునే! నన్ను చూసి నువ్వు భయపడడంలో తప్పులేదు. అయితే యవ్వనంలో నేను చాలా పాపాలు చేశాను. ఎన్నో జంతువుల్నీ, ఎందరో మనుషుల్నీ పొట్టన పెట్టు కున్నాను. చేయరాని పనులన్నీ చేశాను. ఆ పాపాల్ని పోగొట్టుకునేందుకే ఈ కడియం. దీన్ని నీలాంటి పుణ్యాత్ముడికిచ్చి, పాపాల్ని కడిగేసుకోవాలనే నా తాపత్రయం. అర్థం చేసుకో నన్ను’’ అన్నది పులి.


అయినా ముందుకు అడుగు వేయలేకపోయాడు బాటసారి.‘‘ముసలిదాన్ని. లేవలేను. పరిగెత్తలేను. చేతి గోళ్ళూ, కాలి గోళ్ళూ రెండూ మొద్దుబారిపోయాయి. పళ్ళూడిపోయాయి. కళ్ళు కూడా సరిగా కనిపించడం లేదు. మాంసం అన్న ముచ్చటే లేదు. మాంసం తినడాన్ని ఎప్పుడో మానుకున్నాను. పండ్లూ కాయలూ తిని బతుకుతున్నాను. నా అవతారం చూసావు కదా! నమ్మకం కలగడం లేదా? నా గురించి లేనిపోనివి ఆలోచించి భయపడకు. రా! ముందు ఆ చెరువులో స్నానం చెయ్‌.’’ అన్నది పులి.దాని మాటలు నమ్మాడు బాటసారి. పులి మాటలు నమ్మాడనడం కన్నా, బంగారం మీద ఆశ ఎక్కువయిందతనికి. బంగారు కడియం కళ్ళ ముందు కదలాడుతోంటే స్నానం చేసేందుకు చెరువులోనికి దిగాడు. బురద బురదగా ఉంది లోపల. కాలు పెడితే జారి పోతున్నాడు. అయినా తెగించాడు. అంతే! బురదలో దిగబడిపోయాడు. కాలు తీద్దామంటే రావట్లేదు. భయపడ్డాడు.‘‘రక్షించండి బాబో, రక్షించండి’’ కేకలేశాడు.‘‘అరవకు. నేనున్నానుగా! నేను నిన్ను రక్షిస్తాను.’’ అంది పులి. చేతిలోని కడియాన్ని జాగ్రత్త చేసి, అడుగులో అడుగు వేసుకుంటూ మెల్లగా వచ్చి చిక్కిన బాటసారి మీద ఒక్కసారిగా దూకింది. అతన్ని చంపి, కండలూ గుండెలూ తిని కడుపు నింపుకుంది.-కథ ముగించాడు చిత్రగ్రీవుడు.‘‘అందుకే దురాశ పనికి రాదంటారు. దురాశకు పోతే ప్రాణాలే బలి పెట్టాల్సి వస్తుంది. అడవిలో నూకల కోసం ఆశపడితే మనకీ అదే గతి పడుతుంది. అందుకే వద్దంటున్నాను’’ అన్నాడు చిత్రగ్రీవుడు.‘‘ఇలాంటి కథలు చాలా విన్నాం’’ అందో ముసలి పావురం.‘‘నీకన్నీ అనుమానాలే! నీ అనుమానాల్తో ఆకలి తీరదు. ఎదురుగా ఉన్న ఆహారాన్ని కాదనుకుని, ఏవేవో ప్రమాదాలు ఊహించుకోవడం అవివేకం.


 తిరిగి తిరిగి అలసిపోయాం. నూకలు దొరికాయా? లేదు. తీరా దొరికితే వద్దనుకోవడం నా వల్ల కాదు. నేను కిందికి దిగుతున్నాను. నాతో పాటు దిగే వాళ్ళు దిగండి. లేదంటే మీ ఇష్టం.’’ కిందికి దిగేసింది ముసలి పావురం. ఆకలితో ఉన్నాయేమో! మిగిలిన పావురాలు కూడా ‘దిగండి దిగండి’ అంటూ ఒకదానికొకటి చెప్పుకుని కిందికి దిగాయి. తప్పనిసరిగా చిత్రగ్రీవుడు కూడా దిగాల్సి వచ్చింది. అన్నీ వలలో చిక్కుకున్నాయి.‘‘అయ్యయ్యో వలలో ఇరుక్కున్నాం’’ అన్నాయి పావురాలు. ముసలి పావురాన్ని ‘నీ వల్లే, నీ వల్లే ఇదంతా’ అంటూ దాన్ని అనరాని మాటలన్నాయి. తిట్టి తిట్టి పోశాయి.‘‘చిత్రగ్రీవుడు చెబుతూనే ఉన్నాడు. పట్టించుకోలేదు. అనుభవించాల్సిందే’’ అన్నాయి. కన్నీళ్ళు పెట్టుకున్నాయి.‘‘బాధపడకండి! తప్పు మీదీ కాదు, అలాగే ఆ ముసలి పావురానిదీ కాదు, తప్పంతా ఆకలిది. ఆకలిని తట్టుకోలేక దిగాం. వలలో చిక్కుకున్నాం. ఇప్పుడు ఏడ్చి లాభం లేదు. ఆలోచించాలి. బాగా ఆలోచించి, ఇక్కణ్ణుంచి తప్పించుకునే ఉపాయాన్ని కనిపెట్టాలి’’ అన్నాడు చిత్రగ్రీవుడు. ఆలోచనలో పడ్డాడు. ఇంతలో దగ్గరగా వస్తోన్న బోయని చూసి ముసలి పావురం గగ్గోలుగా అరిచింది. ‘‘అడుగడుగో, బోయ వచ్చేస్తున్నాడు. చూడండి చూడండి’’


చూశాడటు చిత్రగ్రీవుడు. చూస్తూనే ఏదో ఆలోచన తట్టిన వాడై పావురాలతో ఇలా అన్నాడు.‘‘ఇప్పుడు ఈ క్షణం ఇక్కణ్ణుంచి మనందరం తప్పించుకోవాలంటే ఒకటే మార్గం ఉంది. అందరం ఒక్కసారిగా పైకెగరాలి. వలతో పాటుగా ఎగరాలి. ఎగిరితే బోయ నుంచి మనం తప్పించుకోగలం. దీన్నే ఐకమత్యం అంటారు. ఐకమత్యాన్ని మించిన బలం లేదు. ఏమంటారు’’‘‘నువ్వెలా చెబితే అలాగే’’ అన్నాయి పావురాలు.‘‘నేను ఒకటి రెండు మూడు అంటాను. మూడనగానే అంద రూ పైకి లేవాలి’’‘‘లేస్తాం’’‘‘అయితే సరే! ఒకటి రెండు మూడు’’ అంటూనే అందరితో పాటుగా పైకి లేచాడు చిత్రగ్రీవుడు. వలతో పాటుగా పావురాలన్నీ పైకి లేచాయి. ఆకాశంలో ఎగరసాగాయి. పావురాలతో పాటుగా తన వల కూడా ఎగిరిపోవడాన్ని చూస్తూ బోయ ఆశ్చర్యపోయాడు. పావురాలు పోతే పోయాయి. తన వల దొరికితే చాలను కున్నాడు. ‘ఉష్‌ ఉష్‌! ఏయ్‌ ఏయ్‌’ అంటూ కేకలేశాడు. పావురాలను చూస్తూ కింద పరుగుదీశాడు. పరగుదీసి పరుగుదీసి అలసిపోయేడే తప్ప, అతనికి పావురాలు చిక్కలేదు. వల కూడా దక్కలేదు. దాంతో బోయ తల పట్టుకుని ఇంటి దారి పట్టాడు.



చిత్రగ్రీవుడి తెలివి


చిత్రగ్రీవుడు చెప్పిన మేరకు పావురాలన్నీ ఒక్కసారిగా పైకి లేచాయి.వలతో పాటుగా ఆకాశంలోకి ఎగిరిపోయాయి. జరిగిందంతా మొదటి నుంచీ గమనిస్తున్న లఘపతనకుడు అనే కాకి, ఈ పావురాలు ఎక్కడికివెళ్తున్నాయి? వల నుంచి ఎలా తప్పించుకుంటాయి? ఇదేదో చూడదగ్గదే అనుకుని అది కూడా ఆకాశంలోకెగిరి, పావురాలను అనుసరించింది.‘‘ఇలా ఎంత దూరం ఎగరాలి? ఎక్కడికని ఎగరాలి’’ చిత్రగ్రీవుణ్ణిప్రశ్నించాయి పావురాలు.‘‘గండకీనది వరకూ ఎగరాలి. దాని ఒడ్డున విచిత్రవనమనే అడవి ఉంది. అక్కడికి మనం చేరు కోవాలి.’’ అన్నాడు చిత్రగ్రీవుడు.‘‘అక్కడికి ఎందుకు’’ అడిగింది ఓ పావురం.‘‘ఎందుకంటే...అక్కడ నా మిత్రుడు ఉన్నాడు. హిరణ్యకుడు అని ఎలుకల రాజతను. అతను మనల్ని కాపాడతాడు. లోకంలో తల్లీ, తండ్రీ, స్నేహితుడూ ఈ ముగ్గురే కాపాడతారు. మిగిలిన వారు కాపాడ గలిగే అవకాశం ఉందికాని, వారికి మనతో అవసరం ఉండాలి. ఉంటేనే కాపాడతారు. లేకపోతే కాపాడరు.’’ అన్నాడు చిత్రగ్రీవుడు.‘‘నిజమే’’ అన్నాయి పావురాలు.‘‘హిరణ్యకుణ్ణి కలిస్తే, అతను ఈ వలను కొరికి ముక ్కలు చేస్తాడు. మనం అప్పుడు తప్పించుకోవచ్చు.’’ అన్నాడు చిత్రగ్రీవుడు.‘‘అయితే ఇంకేం! పదండి, పదండి.’’ అన్నాయి పావురాలు. ఎగరడంలో వేగాన్ని పెంచాయి. వారిని వెన్నంటి వస్తున్న లఘుపతనకుడు కూడా వేగాన్ని పెంచాడు. గండకీనది కనిపించింది. విచిత్రవనం కూడా కనిపించింది. ఒక్కసారిగా పావురాలన్నీ కిందికి దిగాయి. హిరణ్యకుడి కలుగు దగ్గర వాలాయి. రెక్కల టపటపలూ, పావురాల గోలకి కలుగులోని హిరణ్యకుడు ప్రమాదమేదో ముంచుకొచ్చిందని భయపడ్డాడు. కలుగులోనికి మరింతగా వెనక్కి జరిగాడు. కూడదీసుకుని కూడదీసుకుని కలుగు ముందుకు వచ్చాడు చిత్రగ్రీవుడు.‘‘మిత్రమా’’ అని పిలిచాడు.


పరిచయమయిన గొంతులా అనిపించి కొంచెం ముందుకు వచ్చాడు హిరణ్యకుడు.‘‘నేను మిత్రమా! నీ మిత్రుణ్ణి. చిత్రగ్రీవుణ్ణి. నీ సహాయం కోరి వచ్చాను. దయచేసి బయటికి రా’’ అన్నాడు చిత్రగ్రీవుడు. అతని మాట పూర్తికానే లేదు. ఆనందంగా కలుగులోంచి బయటకు వచ్చాడు హిరణ్యకుడు. చిత్రగీవుణ్ణి చూసి ఆనందించాడు.‘‘ఎన్నాళ్ళకెన్నాళ్ళకు మిత్రమా! నిన్ను చూడ్డం నాకు చాలా ఆనందంగా ఉంది.’’ అన్నాడు. అంతలోనే మిత్రుడు వలలో చిక్కుకుని ఉండడాన్ని చూసి ఆశ్చర్యపోయాడు.‘‘ఇదేమిటిది? వలలో చిక్కుకున్నావు’’ అనడిగాడు. సమాధానం చెప్పే లోపే చిత్రగ్రీవుణ్ణి వల నుండి తప్పించేందుకు ప్రయత్నించాడు. వలను కొరకసాగాడు.‘‘ఆగాగు! నన్ను విడిపించడం కాదు, ముందు నావాళ్ళను విడిపించు. తర్వాత నన్ను విడిపించవచ్చు’’ అన్నాడు చిత్రగ్రీవుడు. రాజుగా తోటి వారిని కాపాడడం ప్రథమ కర్తవ్యం అనుకున్నాడతను.‘‘పూర్వజన్మలో ఏ పాపం చేశామో! అందరం ఇలా వలలో చిక్కున్నాం. పాపం, పుణ్యం కాదుగాని, బుద్ధిగా ప్రవర్తించలేకపోయాం. ఫలితంగా శిక్ష అనుభవిస్తున్నాం’’ అన్నాడు చిత్రగ్రీవుడు. వల కొరక్కుండా ఆలోచిస్తోన్న హిరణ్యకుణ్ణి చూశాడు.


ఏమిటాలోచిస్తున్నావు మిత్రమా’’ అడిగాడు.‘‘ఏం లేదు మిత్రమా! నా పళ్ళు కొంచెం ఇబ్బంది పెడుతున్నాయి. నొప్పెడుతున్నాయి. మొత్తం వలంతా కొరకడం అంటే కష్టమనిపిస్తోంది. ముందు నిన్ను విడిపించనీ! తర్వాత సంగతి తర్వాత ఆలోచిద్దాం.’’ అన్నాడు హిరణ్యకుడు. చిత్రగ్రీవుడుకి హిరణ్యకుడి మాటలు నచ్చినట్టు లేదు. అదోలా చూశాడతన్ని.‘‘మిగిలిన పావురాలను కూడా విడిపిస్తాను. అనుమానం లేదు. కాకపోతే చెప్పానుగా! పళ్ళు ఇబ్బంది పెడుతున్నాయని. నొప్పి అని. ముందు నిన్ను విడిపించనీ’’ అని చిత్రగ్రీవుడి దగ్గరి వల తాళ్ళను కొరికే ప్రయత్నంలో పడబోయాడు హిరణ్యకుడు. చిత్రగ్రీవుడు అతనికి అందక వెనక్కి జరిగాడు. ఆశ్చర్యంగా చూశాడు హిరణ్యకుడు.‘‘నీకు నొప్పి కలగనంత వరకూ నన్ను తప్పించి ఎంత మందిని నువ్వు విడిపించగలిగితే అంత మందినీ ముందు విడిపించు. అందరూ విడుద లయిన తర్వాతే నా గురించి నువ్వు ఆలోచించు. అంతేకాని, నన్ను ముందు విడుదల చేసి, మిగిలిన పావురాల సంగతి తర్వాతంటే భావ్యం కాదు.’’ అన్నాడు చిత్రగ్రీవుడు. నవ్వాడు హిరణ్యకుడు.‘‘నువ్వు చెప్పేది చిత్రంగా ఉంది మిత్రమా! తనకు మాలిన ధర్మం అంటారే అలా ఉంది నువ్వు మాట్లాడేది. ముందు నీ గురించి నువ్వు ఆలోచించుకో! తర్వాత మిగిలిన వారి సంగతి ఆలోచించవచ్చు. అలా కాదు, వారి సంగతే ముందు ఆలోచించాలి, తర్వాతే నా సంగతి అంటావా, అప్పుడు నీ అంతటి మూర్ఖుడు ఇంకొకడు లేడనుకుంటాను. రాజుగా నువ్వు క్షేమంగా ఉంటేనే కదయ్యా, ఇతరుల క్షేమాన్ని పట్టించుకునేది. నువ్వే క్షేమంగా లేనప్పుడు వాళ్ళెవరు? నువ్వెవరు?’’ ప్రశ్నించాడు హిరణ్యకుడు.‘‘నిజమే! కాని, నా వాళ్ళంతా కష్టంలో ఉండడాన్ని నేను భరించలేను. సాటి వారు కష్టంలో ఉంటే వారిని ఆదుకోవాలి. అందుకు ప్రాణత్యాగం చేసినా తప్పు లేదు. నేనూ వాళ్ళూ ఒకటే! వాళ్ళు లేకుండా నేను లేను. నేను లేకుండా వాళ్ళు లేరు. 


ఆపదలో ఉన్న నా వాళ్ళను నేను రక్షించుకోలేనప్పుడు నాకీ రాచరికం ఎందుకు? ఎవర్ని ఉద్ధరించడానికి?’’ అన్నాడు చిత్రగ్రీవుడు. పావురాలన్నీ గొప్పగా చూశాయి, తమ రాజుని. రాజంటే చిత్రగ్రీవుడనుకున్నాయి.‘‘ఏదో రోజు అందరం పోయే వాళ్ళమే! ఈ శరీరం అశాశ్వితం. అది తెలుసుకోవాలి ముందు. తెలుసుకునిఉన్న నాలుగు రోజులూ నాలుగు కాలాల పాటు నిలిచే పనులు చెయ్యాలి. తోటివారికి సాయం చెయ్యాలి. అందుకని చెబుతున్నాను. మరోలా అనుకోకు. ముందు నా వాళ్ళను కాపాడు. తర్వాత నీకు వీలయితేనే నన్ను కాపాడు.’’ అన్నాడు చిత్రగ్రీవుడు.అతని మంచితనానికి ముచ్చటపడ్డాడు హిరణ్యకుడు. మనసులో జేజేలర్పించాడు.


‘మిత్రమా! నీదెంత మంచి బుద్ధి. మంచి చెడ్డలు రెండూ నీకు బాగా తెలుసు. ఈ పావురాలకే కాదు, ముల్లోకాలకూ నువ్వు రాజుకావాల్సిన వాడవు. గొప్పవాడవు.’’ అన్నాడు. మెచ్చుకోలుగా మిత్రుని చూసి, తర్వాత వల తాళ్ళన్నీ కొరికి, అందర్నీ బంధవిముక్తుల్ని చేశాడు. పావురాలన్నీ తేలికపడ్డాయి. హిరణ్యకునికి కృతజ్ఞతలు తెలియజేశాయి. రాక రాక వచ్చిన మిత్రునికీ, మిగిలిన పావురాలకీ విందునిచ్చి వారిని సాగనంపాడు హిరణ్యకుడు. ఆకాశంలోకి ఆనందంగా ఎగిరిన పావురాలను చూసి, తన కలుగులోనికి వెళ్ళిపోయాడతను.పావురాలతో పాటుగా వచ్చి అంతా చాటుగా చూసిన లఘుపతనకుడు, పావురాలకు ఎలుక చేసిన సాయాన్ని మనసులో మెచ్చుకోకుండా ఉండలేక పోయాడు. వల తాళ్ళ నుండి పావురాలను ఎలుక విడిపించిన తీరు బాగుంది బాగుంది అనుకున్నాడు. స్నేహం అంటే ఇది. ఇలా ఉండాలి. స్నేహితులంటే వీళ్ళు, చిత్రగీవుడు-హిరణ్యకుడు అనుకుంది. తను కూడా హిరణ్యకునితో స్నేహం చేయాలనుకుంది. అనుకున్నదే ఆలస్యం చాటు నుంచి తప్పుకుని, హిరణ్యకుని కలుగు దగ్గరకు చేరుకుంది.



జింక-నక్క కథ


స్నేహితులంటే ఇలా ఉండాలి. చిత్రగ్రీవుడు, హిరణ్యకులే అసలు సిసలు స్నేహితులుఅనుకున్నాడు లఘు పతనకుడు. హిరణ్యకునితో స్నేహం చేయాలనుకున్నాడు. చాటు నుండి తప్పుకుని, హిరణ్యకుని కలుగుదగ్గరకు చేరుకున్నాడు.‘‘హిరణ్యకా’’ పిలిచాడు.మళ్ళీ తనని పిలుస్తున్నది ఎవరా? అని సాలోచనగా చూశాడు హిరణ్యకుడు.‘‘నువ్వు మామూలు వాడివి కాదు. మహానుభావుడివి. ఇందాక జరిగిందంతా నేను చూశాను. చిత్రగ్రీవుడికి నీలాంటి స్నేహితుడు ఉండడం అతని అదృష్టం. నాక్కూడా నీతో స్నేహం చేయాలని ఉంది. నీతో తిరగాలని ఉంది. మనిద్దరి స్నేహం కూడా ముందు తరాలకి ముచ్చటగా ఉండాలి. రా! బయటికి రా! మాట్లాడుకుందాం’’ అన్నాడు లఘుపతనకుడు.‘‘అసలు ఎవరు నువ్వు’’ కలుగులోంచే ప్రశ్నించాడు హిరణ్యకుడు. లఘుపతనకుడు జవాబు చెప్పబోయేంతలోనే మళ్ళీ ఇలా అన్నాడతడు.‘‘నువ్వెవరో తెలీదు. నీ రూపు రేఖలేంటో తెలీదు. తెలియని వారితో స్నేహం చేయడం ఎలా’’పాపం! భయపడుతున్నాడనుకుని, సన్నగా నవ్వుకుని ఇలా అన్నాడు లఘుపతనకుడు.‘‘నేనో కాకిని. నా పేరు లఘుపతనకుడు’’కాకి అన్న మాట వినిపించగానే హిరణ్యకుని గుండెలు జారిపోయాయి. కాకితో స్నేహమా? కలలో మాటనుకున్నాడతను.‘‘అమ్మో! నీతో స్నేహమా? జరగని పని. మీ కాకి జాతి పనేమిటి? మా ఎలుక జాతిని పట్టి, చంపి తినడం. మీతో స్నేహం అంటే కోరి చావును కొని తెచ్చుకోవడమే! వద్దు! నీకూ నాకూ స్నేహం కుదరదు. వెళ్ళిక్కణ్నుంచి’’ అన్నాడు హిరణ్యకుడు.‘‘అది కాదు, నేను చెప్పేది విను.


ముందు బయటికి రా.’’‘‘చచ్చినా రాను. బయటికి వస్తే నన్ను పొడుచుకుని తింటావు. సమాన వియ్యం సమాన కయ్యం అంటారు. అలాగే స్నేహం కూడా సమానులతోనే చెయ్యాలి. నువ్వూ నేనూ ఏ రకంగానూ సమానులం కాము. అందుకని ఎందుకొచ్చిన గొడవ, మనిద్దరికీ స్నేహం కుదరదుగానీ వెళ్ళిక్కణ్నుంచి’’ అన్నాడు హిరణ్యకుడు.లఘుపతనకుడు కదిలిన శబ్దం వినరాలేదు. దాంతో మళ్ళీ ఇలా అన్నాడు.‘‘తారతమ్యాలు తెలుసుకోక వెనకటికి ఓ జింక, నక్కతో స్నేహం చేసింది. చేసి, ప్రాణాల మీదికి తెచ్చుకుంది. ఆ కథ నీకు తెలుసు కదా’’‘‘తెలీదు’’ అన్నాడు లఘుపతనకుడు.‘‘అయితే విను, చెబుతాను’’ అంటూ కథ చెప్ప సాగాడు హిరణ్యకుడు.జింక-నక్క కథఅనగనగా మగధదేశం. ఆ దేశంలో ఓ అడవి. దాని పేరు మందారవతి. ఆ మందారవతి అడవిలో ఓ జింకా, ఓ కాకీ ఉండేవి. ఉండేవంటే మామూలుగా ఉండడం కాదు, స్నేహంగా ఉండేవి. జింక అంటే కాకికి ఇష్టం. కాకి అంటే జింకకి ఇష్టం. దాంతో చెట్ట పట్టాలేసుకుని తిరిగేవవి. అడవి అంతా పచ్చపచ్చగా ఉండేది. జింకకి కావలిసినంత మేత దొరికేది. తిన్నంత తిని బాగా బలిసింది జింక. అందమైన అడవి. ఆరోగ్యంగా ఉంది. ఇకనేం! ఎక్కడ పడితే అక్కడికి చె ంగు చెంగున గెంతుకుంటూ వెళ్ళేది జింక. అదలా గెంతుకుంటూ వెళ్తోంటే దాన్ని ఓ నక్క చూసింది. ఆహా! జింక అంటే ఇది కదా! ఎంత చక్కగా బలిసి ఉందో! తింటే మహా రుచిగా ఉంటుంది. తినాలి దీన్ని. తినాలంటే చక్కని ఉపాయం ఆలోచించాలనుకుని, జింక చెంతకు చేరిందది.


‘బాగున్నావా మిత్రమా’’ అడిగింది.ఒక్క గెంతు గెంతి నక్కకు దూరంగా జరిగింది జింక.‘‘మిత్రమా! ఇదెక్కడి పిలుపు’’ అడిగింది.‘‘నువ్వెవరో నాకు తెలియదు. నా జోలికి రాకు’’ అంటూ పరుగెత్తబోయింది.‘‘ఆగాగు’’ అంది నక్క. ఆగింది జింక.‘‘నా పేరు సుబుద్ధి. ఈ అడవిలో ఒంటరిగా ఉంటున్నాను. ‘నా’ అన్నవారు నాకెవరూ లేరు. నక్కలన్నీ నన్నొదిలేసి ఎక్కడికి వెళ్ళిపోయాయో వెళ్ళిపోయాయి. దాంతో దిక్కులేని దాన్నయిపోయాను.’’ అన్నది నక్క. కన్నీళ్ళు పెట్టుకుంది. ‘అయ్యో పాపం’ అనిపించింది జింకకి.‘‘తోడు లేకుండా అడవిలో బతకడం ఎంత కష్టమో తెలిసొస్తూంది. చావలేక బతుకుతున్నాను. నిన్ను చూశానో లేదో నా వాళ్ళను చూసినట్టనిపించి ఎక్కడ లేనిఆనందం కలిగింది. దేవుడిలా కనిపించావు.’’ అంది నక్క.జింక పొంగిపోయింది.‘‘నీకే హానీ చెయ్యను. నన్ను నమ్ము. నా ఒంటరి తనాన్ని పోగొట్టు. దయచేసి నాతో జట్టు కట్టు. ఇద్దరం కబుర్లాడుకుంటూ కలిసి తిరుగుదాం’’ అంది నక్క. దాని మాటలన్నీ నమ్మేసింది జింక. నక్కతో స్నేహానికి ఒప్పుకుంది. ఇద్దరూ అడవి అంతా తిరిగి తిరిగి చీకటి పడ్డాక ఇంటి దారి పట్టారు.‘‘సరదాగా మా ఇంటికి రావచ్చుగా’’ అడిగింది జింక.‘‘రమ్మంటే ఎందుకు రాను? పద’’ అంది నక్క. జింకతో పాటుగా ఇంటికి చేరింది. చెట్టుకొమ్మ మీద కూర్చుని జింకతో పాటుగా వస్తూన్న నక్కని చూసింది కాకి.‘‘ఎ..ఎయ్‌...ఎవరది’’ అరిచింది.‘‘నక్క మిత్రమా! సుబుద్ధి అని మంచి నక్కే! పాపం దిక్కూ మొక్కూ లేదంటేనూ, ఒంటరి దాన్నంటేనూ, జాలిపడి తీసుకొచ్చాను. మన స్నేహాన్ని కోరుకుంటోంది.’’ అంది జింక. నక్కతో స్నేహమా? ఎక్కడయినా విన్నామా! అనుకుంది కాకి.‘‘కొత్తవాళ్ళను నమ్మకూడదు. నమ్మితే మోసపోతాం. అయినా చూస్తూ చూస్తూ నక్కతో స్నేహం ఏమిటి? దాని గుణగుణాలన్నీ అందరికీ తెలిసినవే కదా! జాగ్రత్త! పిల్లిని ఆదరించి ముసలి గద్ద ముగిసిపోయిందని కథ ఒకటి ఉందిలే! ఆ కథ గుర్తొస్తూంది’’ అంది కాకి.‘‘ఆ కథేంటో చెప్పవూ’’ అడిగింది జింక.‘‘చెబుతాను, విను’’ అంటూ కథ చెప్పసాగింది కాకి.గుడ్డిగద్ద కథవెనకటికి గంగానదీ తీరాన ఓ జువ్విచెట్టు ఉండేది. 


దాని తొర్రలో ఓ గుడ్డిగద్ద ఉండేది. దాని పేరు జరద్గవం. గద్ద గుడ్డిదే కాదు, ముసలిది కూడా. దాంతో అది ఎగరలేక, చెట్టుని అంటిపెట్టుకుని ఉండేది. చెట్టు మీది మిగిలిన పక్షులు దాని దుస్థితికి జాలిపడ్డాయి. జాలిపడి, రోజూ సంపాదించుకుని వచ్చిన ఆహారాన్ని పిల్లలకే కాకుండా, ఈ గుడ్డిగద్దకు కూడా కొంచెం పెట్టేవి. పెట్టి-‘‘తెల్లారితే తిండి కోసం పరుగులు తీసే పరిస్థితి మాది. పిల్లల్ని వదిలి వెళ్ళాల్సి వస్తూంది. చీకటి పడితేనే కాని, గూటికి చేరుకోలేం. నీకిదంతా తెలిసిందే! అయితే మేమంతా తిండి సంపాదించుకుని, గూటికి చేరే వరకూ పిల్లలకి నువ్వే దిక్కూ మొక్కూ కావాలి. నీకు కళ్ళు కనిపించవు. నీ కాళ్ళు కదలవు. అయినా నీ అవయవాలన్నీ సక్రమంగా ఉన్నట్టుగానే ప్రవర్తించు. గట్టిగా ఉండు. మా పిల్లలకు కాపలాగా ఉండు.’’ అనేవి. అలాగేనంటూ గుడ్డిగద్ద కాపలా కాసేది.


ఒక రోజు ఆ చెట్టు కిందికి పిల్లి ఒకటి వచ్చింది. చెట్టు మీది గూళ్ళలో పక్షి పిల్లల గోల వినవస్తే, నోరూరుతూంటే, నాలికను పెదాలకు రాసుకుని, ‘లేలేత మాంసం దొరికింది’ అనుకుంటూ చెట్టెక్కింది. మెల్ల మెల్లగా అడుగులు వేసుకుంటూ చెట్టెక్కుతోన్న పిల్లిని చూసి పక్షి పిల్లలు ‘అమ్మో! అయ్యో’ అంటూ గోలగోల చేశాయి. ఆ గోలకి ఏదో ప్రమాదం ముంచుకు వచ్చిందని గ్రహించిన గుడ్డిగద్ద ‘‘ఎవరదీ’’ అంటూ గట్టిగా అరిచింది. ఆ అరుపుకి పిల్లి తెగ భయపడిపోయింది. వణికిపోయింది. శరీరం వణకడంతో కాలు జారి కింద పడాల్సిందే! కాని నిలదొక్కుకుంది. చెట్టెక్కినప్పుడు పక్షిపిల్లలను తినాలన్న ధ్యాసలో గుడ్డిగద్దను గమనించలేదు పిల్లి. ఇప్పుడు గమనించింది. దగ్గరగానే ఉంది గద్ద. తప్పించుకునే అవకాశం లేదు. ఏం చెయ్యను, ఏం చెయ్యననుకుంటూ పరిపరి విధాల ఆలోచించింది పిల్లి. ఏ ఆలోచనా రూపు కట్టలేదు దానికి. ఆఖరికి ఇలా అనుకుంది.పొరపాటు చేశాను. పక్షిపిల్లలకు ఆశపడి చెట్టెక్కాను. ఎక్కుతున్నప్పుడే ప్రమాదాన్ని గుర్తించాలి. అప్పుడు గుర్తించలేదు. ఇప్పుడు గుర్తించాను. ఈ ప్రమాదం నుంచి తప్పించుకోవడం కష్టమే! కాని, తప్పించుకోవాలి. ఎలా? ఎలా అంటే...ఈ గద్దకు ఏవో మాయమాటలు చెప్పాలి. దీన్ని నమ్మించాలి. నమ్మించి ప్రాణాలు నిలబెట్టుకోవాలి. లేదంటే చావు తప్పదు.గజగజా వణుకుతూనే గద్ద దగ్గరకు చేరింది పిల్లి.



నక్కజిత్తులు


‘ఎవరది’ అంటూ గట్టిగా అరిచిన గద్ద దగ్గరకు గజాగజా వణుకుతూ చేరింది పిల్లి. ఎవరో వచ్చి తన ఎదురుగా నిలుచున్నారని గ్రహించింది గద్ద.‘‘ఎవరు నువ్వు’’ అడిగింది.‘‘అయ్యా నా పేరు దీర్ఘకర్ణం. పిల్లిని’’‘‘పిల్లివా? నీకిక్కడేం పని? వెళ్ళిక్కణ్ణుంచి. లేదంటే చంపేస్తాను’’ బెదిరించింది గద్ద. నేరకపోయి చెట్టెక్కేను. దీనిపాలబడ్డాననుకుంటూ ఇలా అంది పిల్లి.‘‘నాకిక్కడ చాలా పని ఉంది. పని మీదే వచ్చానిక్కడికి. మీరు వెళ్ళిపొమ్మంటున్నారు. వె ళ్ళకపోతేచంపుతానంటున్నారు. ఎలా ఇప్పుడు’’ అంది పిల్లి.‘‘పనేంటసలు? ఎవరితో పని’’ అడిగింది గద్ద.‘‘మీతోనే పని’’‘‘నాతో నీకేం పని’’‘‘అయ్యా! నేను అన్ని పిల్లుల్లా కాదు. సాధుజంతువుని. శాఖాహారిని. మాంసం తినడం ఎప్పుడో మానేశాను. పుణ్యం కోసం రోజూ అదిగో అక్కడ గంగానదిలో స్నానం చేస్తుంటాను. బ్రహ్మచారిని. చాంద్రాయణ వ్రతంలో ఉన్నాను.’’‘‘ఉంటే’’ అడిగింది గద్ద.‘‘ఇంకేం లేదు. మీరు పెద్దలని, మంచివారని, నీతిశాస్త్రాన్ని పుక్కిటపట్టారని ఈ చుట్టుపక్కల పక్షులన్నీ అనుకుంటుండగా విన్నాను. అప్పట్నుంచీ మిమ్మల్ని కలవాలని, కలిసి మీతో మాట్లాడాలని నాదో చిన్న కోరిక. ఆ కోరిక తీర్చుకోవడానికి వచ్చాను.’’ అంది పిల్లి. తనని పిల్లి గౌరవించడం, తనని కలిసేందుకు రావడం ఎంతో గొప్పగా అనిపించింది గద్దకి.‘‘మీలాంటి పెద్దలతో మాట్లాడితే నాలుగు మంచి ముక్కలు చెవిన పడతాయి. నీతులూ, ధర్మాలూ తెలుసుకోవచ్చని ఆశగా వచ్చాను. వచ్చినందుకు బాగానే ఉంది.


చంపుతానంటున్నారు.’’ బాధగా అంది పిల్లి.‘‘బాధపడకు! అసలు సంగతి ఏమిటంటే...ఈ చెట్టు మీద అనేక పక్షిగూళ్ళు ఉన్నాయి. ఆ గూళ్ళలో పిల్లలు ఉన్నాయి. పక్షిపిల్లలంటే పిల్లులకి ఇష్టం కదా! అందుకు వచ్చావేమోనని అనుమానించాను.’’‘‘రామ రామ! ఎంతమాట ఎంతమాట! పిల్లిగా పుట్టడమే మహాపాపం అనుకుంటుంటే అందులో మళ్ళీ అన్నెం పున్నెం ఎరుగని పక్షి పిల్లల్ని తినటం ఒకటా!! ఛఛ! ‘అహింస పరమో ధర్మః’ అన్నారు. అంటే జీవహింస చేయకపోవడమే అన్ని ధర్మాలలోకెల్లా గొప్ప ధర్మం. జీవహింస చేయని వారికే స్వర్గద్వారాలు తెరుచుకుంటాయట! భూతదయే గొప్ప ధర్మం. ఇన్ని తెలిసిన నేను, పాపం ఆ చిన్నారి పొన్నారి పక్షి పిల్లల్ని తింటానా? అది ఊహించడానికే అసహ్యంగా లేదూ’’ అంది పిల్లి.‘‘అది కాదు దీర్ఘకర్ణా’’ అని గద్ద ఏదో నచ్చజెప్పబోయేంతలో గద్ద మాటను పట్టించుకోకుండా మళ్ళీ ఇలా అంది పిల్లి.‘‘ఈ పాడుపొట్టను నింపుకోవాలంటే ఇంత పెద్ద అడవిలో ఏదో ఒకటి దొరక్కుండా పోదు. ఆఖరికి నాలుగాకులు తిన్నాకడుపు నిండిపోతుంది. అంతేగాని, చెట్టు మీది పిల్లలను చంపి తింటానా? చేజేతులా నరకాన్ని కోరుకుంటానా? ఎంతమాట ఎంతమాట’’పిల్లి గొంతులో పలికిన బాధ నిజం అనుకుంది గద్ద. ‘అయ్యయ్యో, పొరబడ్డానే’ అనుకుంది. పిల్లిని ఇలా ఓదార్చింది.


నక్కజిత్తులు


‘ఎవరది’ అంటూ గట్టిగా అరిచిన గద్ద దగ్గరకు గజాగజా వణుకుతూ చేరింది పిల్లి. ఎవరో వచ్చి తన ఎదురుగా నిలుచున్నారని గ్రహించింది గద్ద.‘‘ఎవరు నువ్వు’’ అడిగింది.‘‘అయ్యా నా పేరు దీర్ఘకర్ణం. పిల్లిని’’‘‘పిల్లివా? నీకిక్కడేం పని? వెళ్ళిక్కణ్ణుంచి. లేదంటే చంపేస్తాను’’ బెదిరించింది గద్ద. నేరకపోయి చెట్టెక్కేను. దీనిపాలబడ్డాననుకుంటూ ఇలా అంది పిల్లి.‘‘నాకిక్కడ చాలా పని ఉంది. పని మీదే వచ్చానిక్కడికి. మీరు వెళ్ళిపొమ్మంటున్నారు. వె ళ్ళకపోతేచంపుతానంటున్నారు. ఎలా ఇప్పుడు’’ అంది పిల్లి.‘‘పనేంటసలు? ఎవరితో పని’’ అడిగింది గద్ద.‘‘మీతోనే పని’’‘‘నాతో నీకేం పని’’‘‘అయ్యా! నేను అన్ని పిల్లుల్లా కాదు. సాధుజంతువుని. శాఖాహారిని. మాంసం తినడం ఎప్పుడో మానేశాను. పుణ్యం కోసం రోజూ అదిగో అక్కడ గంగానదిలో స్నానం చేస్తుంటాను. బ్రహ్మచారిని. చాంద్రాయణ వ్రతంలో ఉన్నాను.’’‘‘ఉంటే’’ అడిగింది గద్ద.‘‘ఇంకేం లేదు. మీరు పెద్దలని, మంచివారని, నీతిశాస్త్రాన్ని పుక్కిటపట్టారని ఈ చుట్టుపక్కల పక్షులన్నీ అనుకుంటుండగా విన్నాను. అప్పట్నుంచీ మిమ్మల్ని కలవాలని, కలిసి మీతో మాట్లాడాలని నాదో చిన్న కోరిక. ఆ కోరిక తీర్చుకోవడానికి వచ్చాను.’’ అంది పిల్లి. తనని పిల్లి గౌరవించడం, తనని కలిసేందుకు రావడం ఎంతో గొప్పగా అనిపించింది గద్దకి.‘‘మీలాంటి పెద్దలతో మాట్లాడితే నాలుగు మంచి ముక్కలు చెవిన పడతాయి. నీతులూ, ధర్మాలూ తెలుసుకోవచ్చని ఆశగా వచ్చాను. వచ్చినందుకు బాగానే ఉంది.


చంపుతానంటున్నారు.’’ బాధగా అంది పిల్లి.‘‘బాధపడకు! అసలు సంగతి ఏమిటంటే...ఈ చెట్టు మీద అనేక పక్షిగూళ్ళు ఉన్నాయి. ఆ గూళ్ళలో పిల్లలు ఉన్నాయి. పక్షిపిల్లలంటే పిల్లులకి ఇష్టం కదా! అందుకు వచ్చావేమోనని అనుమానించాను.’’‘‘రామ రామ! ఎంతమాట ఎంతమాట! పిల్లిగా పుట్టడమే మహాపాపం అనుకుంటుంటే అందులో మళ్ళీ అన్నెం పున్నెం ఎరుగని పక్షి పిల్లల్ని తినటం ఒకటా!! ఛఛ! ‘అహింస పరమో ధర్మః’ అన్నారు. అంటే జీవహింస చేయకపోవడమే అన్ని ధర్మాలలోకెల్లా గొప్ప ధర్మం. జీవహింస చేయని వారికే స్వర్గద్వారాలు తెరుచుకుంటాయట! భూతదయే గొప్ప ధర్మం. ఇన్ని తెలిసిన నేను, పాపం ఆ చిన్నారి పొన్నారి పక్షి పిల్లల్ని తింటానా? అది ఊహించడానికే అసహ్యంగా లేదూ’’ అంది పిల్లి.‘‘అది కాదు దీర్ఘకర్ణా’’ అని గద్ద ఏదో నచ్చజెప్పబోయేంతలో గద్ద మాటను పట్టించుకోకుండా మళ్ళీ ఇలా అంది పిల్లి.‘‘ఈ పాడుపొట్టను నింపుకోవాలంటే ఇంత పెద్ద అడవిలో ఏదో ఒకటి దొరక్కుండా పోదు. ఆఖరికి నాలుగాకులు తిన్నాకడుపు నిండిపోతుంది. అంతేగాని, చెట్టు మీది పిల్లలను చంపి తింటానా? చేజేతులా నరకాన్ని కోరుకుంటానా? ఎంతమాట ఎంతమాట’’పిల్లి గొంతులో పలికిన బాధ నిజం అనుకుంది గద్ద. ‘అయ్యయ్యో, పొరబడ్డానే’ అనుకుంది. పిల్లిని ఇలా ఓదార్చింది.


అవును కదా’ అన్నట్టుగా కాకిని చూసింది జింక.‘‘చూడు, బతికినంత కాలం బతకం. రేపో మాపో అంతా చనిపోయే వాళ్ళమే! ఈ మూడునాళ్ళ ముచ్చట కోసం అనుమానాలూ, శత్రుత్వాలూ పెంచుకోవద్దు. మంచినే తలపెడదాం. మంచిగా ఉందాం. స్నేహంగా ఉందాం. నలుగురితో స్నేహంగా ఉండడం చాలా అవసరం.’’ అంది నక్క.‘‘నిజమే! ఉన్న నాలుగు రోజులూ కలిసి మెలసి ఉందాం. లేనిపోని అనుమానాలు అనవసరం.’’ అంది జింక. ఒప్పుకోక తప్పింది కాదు కాకికి. ‘సరే మరి’ అంది. కొద్ది రోజులు గడిచాయి. కాకి-నక్క-జింక స్నేహంగా ఉంటూ హాయి హాయిగా అడవి అంతా తిరగసాగాయి. ఒకరోజు జింకను తీసుకుని వెళ్ళి మంచి పంట పొలాన్ని చూపించింది నక్క. పంట ఎపుగా పెరిగి ఉందక్కడ.‘‘చూస్కో! కన్నుల పంటంటే ఇదే! కడుపునిండా తిను.’’ అన్నది నక్క. జింకకు పట్టపగ్గాలు లేకపోయాయి.


పొలంలో పడి, పంటను తిన్నది. మర్నాడు, ఆ మర్నాడు...అలా వారం పదిరోజులుగా పంటను తినేస్తోంది జింక. రోజు రోజుకీ పంట తరిగిపోవడంతో ‘ఏదో జంతువు పొలంలో పడి పంటను తినేస్తోంది. దాని అంతు చూడాల్సిందే. దాన్ని ప్రాణాలతో వదలకూడదు’ అనుకున్నాడు ఆ పొలం యజమాని. బాగా ఆలోచించి పొలంలో వలపన్నాడు. ఆకలికి పరుగుదీస్తూ పొలంలోకి వచ్చింది జింక. వచ్చి, అక్కడ పన్నిన వలలో చిక్కుకుంది. బయటపడేందుకు తీవ్రంగా ప్రయత్నించింది. తన వల్ల కాలేదు. అలసిపోయి చతికిలబడింది జింక. తొందరగా నక్క వస్తే బాగుణ్ణనుకుంది. తోడుకుని పోయేందుకు నక్క రావడం మామూలే! నక్క వచ్చిందంటే ప్రాణాలు దక్కినట్టేననుకుంది. నక్క కోసం వేచి చూడసాగింది. 


కాస్సేపటికి నక్క వచ్చిందక్కడికి. వలలో చిక్కుకుని బిక్కుబిక్కుమంటున్న జింకను చూసింది. పండగేననుకుంది తనకి. పొలం యజమాని వచ్చాడంటే జింకకు చావు తప్పదు. కొట్టి కొట్టి చంపుతాడతను. అప్పుడు ఎంచక్కా కరువు తీరా జింక మాంసాన్ని తినవచ్చన నుకుంది నక్క. అయితే లోలోపలి తన భావాలేవీ జింక గ్రహించకుండా బయటికి బాధ నటిస్తూ జింక దగ్గరగా పరుగు పరుగున వచ్చింది నక్క.‘‘వచ్చావా! నీకోసమే చూస్తున్నాను. రారా! తొందరగా వల తాళ్ళను కొరుకు. బయటపడతాను. ఈ పొలం యజమాని రాక ముందే మన ం ఇక్కణ్ణుంచి పారిపోవాలి.’’ అంది జింక.‘‘అవునవును’’ అంటూ వల తాళ్ళను కొరికేందుకు ప్రయత్నిస్తున్నట్టుగా చూసి, తర్వాత తాళ్ళ వాసనను భరించలేనట్టుగా దూరంగా జరిగింది నక్క.‘‘ఏమయింది’’ అడిగింది జింక.‘‘ఈ వల తాళ్ళు ఏ జంతువు నరాలతో చేశారోగాని, ఒకటే వాసన వేస్తున్నాయి. అదలా ఉండనీ! ఈ తాళ్ళను కొరకాలంటే ఈ రోజు సోమవారం. సోమవారం నాడు నేను ఏ జంతువు నరాలనూ ముట్టను. ముడితే వ్రతభంగం అయిపోతుంది. పాపం చుట్టుకుంటుంది.’’ అంది నక్క.ఊహించని జావాబు అది. జింకకు స్పృహ తప్పినంత పనయింది.




చెరపకురా చెడేవు


తాళ్ళను కొరికి తనని వల నుంచి నక్క రక్షిస్తుందనుకున్నది జింక. అయితే ఆ తాళ్ళను తాను కొరకరాదని, కొరికితే వ్రతభంగమవుతుందంటూ నక్క సన్నాయి నొక్కులు నొక్కింది. దాంతో జింకకు ప్రాణాల మీద ఆశలు అడుగంటాయి.‘‘ఇంకో విధంగా అనుకోకు! ఈ పని తప్ప నువ్వు ఇంకే పని చేయమన్నా చిటికెలో చేస్తాను. మోమాట పడకుండా చెప్పు, నేను ఆ మూల ఉంటాను’’ అంటూ తనలో తాను సన్నగా నవ్వుకుంటూ చాటుగా దాగుంది నక్క. జింకకు కొద్దిదూరంలో కూర్చుంది. పొలం యజమాని తొందర గా వస్తే బాగుణ్ణు! జింక ఎంచక్కా చస్తుంది. అప్పుడు దాని కండలు నోటి నిండుగా తినొచ్చుననుకుంటూ నాలికను చప్పరించింది నక్క. వలలో నుండే నక్కను గమనించసాగింది జింక. నక్క జిత్తులమారితనం అర్థమయిపోయింది తనకి. అనుమానం లేదు, అది తన చావును కోరుకుంటోం దనుకుంది జింక. ఇప్పుడు ఏడ్చి ప్రయోజనం లేదు. జరగాల్సింది జరుగుతుందననుకున్నది జింక. తన దురదృష్టానికి చింతిస్తూ తలను నేలకు వాల్చింది.ఎప్పుడనగానో మేతకు వెళ్ళిన జింక ఇంకా రాలే దే మిటి? ఏమయి ఉంటుంది? అనుకుంటూ జింకను వెతుక్కుంటూ వచ్చిన కాకికి, పొలంలో వలలో చిక్కుకున్న జింక కనిపించింది. జింకను చూస్తూనే ‘అయ్యయ్యో’ అనుకుంది కాకి. జింకను వల నుంచి తప్పించాలి. ఎలా? తనకు వలను కొరకడం రాదే! అన్నట్టు నక్కకి వచ్చు. నక్కబావను కేకేస్తే సరి అనుకుంది. అరబోయింది.‘‘ఎవరిని కేకేద్దామనుకుంటున్నావు’’ అడిగింది జింక.‘‘నక్కబావని’’ అంది కాకి.‘‘కేకేయడం ఎందుకు, అదిగో అక్కడే ఉన్నాడు చూడు’’ చూపించింది జింక.


తనని జింక-కాకి చూస్తున్నారన్నది గమనించి వాళ్ళను చూడక ఇటుగా ముఖం తిప్పుకుంది నక్క.‘‘నా చావుకోసం చూస్తున్నాడు. నా మాంసం కోసం కాచుక్కూర్చున్నాడు.’’ బాధపడుతూ చెప్పింది జింక. అంతా అర్థమయింది కాకికి.‘‘నేను ముందే చెప్పాను. విన్నావా? చూడిప్పుడు ఏం జరిగిందో! చెడ్డవాడు చెడ్డవాడే! వాడు మంచివారికి కూడా కీడే తలపెడతాడు. నేను వాడికి కీడు తలపెట్టలేదు, వాడు నాకు కీడు తలపెట్టాడనుకోవడం తప్పు.’’ అంది కాకి.జింక కళ్ళు చెమర్చుకుంది.‘‘మృత్యుముఖంలో ఉన్నవారు, కమ్ముకొస్తోన్న చీకటిని గుర్తించలేరు. ఆకాశంకేసి చూడలేరు. బంధు మిత్రుల మాటలు వినిపించుకోరని పెద్దలు వూరకనే అనలేదు’’ అంది కాకి.తలొంచుకుంది జింక.‘‘ఎదురుగా ఉండి పొగుడుతూ వెనుక గోతులు తీసే స్నేహితులు, పాలబిందెలనిపించే విషపు కుండల్లాటివారు. వాళ్ళతో స్నేహం పనికిరాదు.’’ అన్నది కాకి.‘‘నీ మాటలన్నీ నిజాలే! మంచివారితో స్నేహం చేస్తే అన్నీ లాభాలూ, ఆనందాలే! చెడ్డవారితో స్నేహం చేస్తే అన్నీ నష్టాలూ కష్టాలే! నక్క మాటలు విని మోసపోయాను. అది తేనె పూసిన కత్తి అని తెలుసుకోలేక పోయాను’’ అన్నది జింక. అంతలో పొలం యజమాని అక్కడికి రాసాగాడు. అతని చేతిలో దుడ్డుకర్ర ఉంది. ఆ కర్రనూ, కోపంగా పెద్దపెద్దగా అంగలు వేసుకుంటూ వస్తోన్న యజమానినీ కాకితో పాటుగా చూసి చావు భయంతో వణికిపోయింది జింక.



‘‘అయిపోయాను మిత్రమా, యజమాని వచ్చేస్తున్నాడు.’’ అంది.‘‘అవును. ఏం చేద్దాం? ఏం చెయ్యాలి’’ ఆలోచనలో పడింది కాకి. శరవేగంగా ఆలోచించి ఓ నిర్ణయానికి వచ్చింది.‘‘మిత్రమా! ఇప్పుడు నువ్వు ఈ వల నుంచి తప్పించుకోవాలంటే ఒకే ఒక ఉపాయం ఉంది. అదేంటంటే...నువ్వు ఊపిరి బిగిబట్టి, కాళ్ళు చాచి బిర్రబిగుసుకుని చచ్చినట్టు పడి ఉండు. నువ్వు చచ్చిపోయావని యజమానికి మరింత నమ్మకం కలిగేలా నేను, నీ కళ్ళ మీద నా ముక్కుతో పొడుస్తూ ఉంటాను.’’‘‘అమ్మో’’ అంది జింక.‘‘పొడుస్తున్నట్టుగా నటిస్తాను. అంతే! అది చూసి నువ్వు నిజంగానే చచ్చిపోయావనుకుని, యజమాని నీ మీది వల తొలగిస్తాడు. సమయం చూసి అప్పుడు నేను కావు మని అరుస్తాను. అదే గుర్తు. వెంటనే లేచి నువ్వు పారిపో’’ అంది కాకి.‘‘బలే బలే’’ అంది జింక. కాకి చెప్పినట్టుగానే ఊపిరి బిగబట్టింది. కాళ్ళు చాచి బిర్రబిగుసుకుంది. చచ్చినట్టు పడి ఉంది. జింక కళ్ళను ముక్కుతో పొడుస్తూ కాకి నిలుచుంది.పొలం యజమాని జింక దగ్గరగా వచ్చాడు. అతన్ని చూస్తూనే ఎగిరి పోయింది కాకి. దగ్గరగా ఉన్న చెట్టుకొమ్మ మీద వాలింది. జింకను తేరిపార చూశాడు యజమాని. కదలిక లేదు జింకలో. దాంతో ఇది చచ్చినట్టుందే అనుకున్నాడు. జింక మీది వలను తొలగించాడు. అదే అవకాశంగా కాకి కావుమంటూ అరిచింది. అంతే! జింక పరుగందుకుంది. జరిగిందాన్ని నమ్మలేక పోయాడు యజమాని. కోపం వచ్చిందతనికి. చేతిలోని దుడ్డుకర్రను జింక మీదికి గురిపెట్టి విసిరాడు. జింక తప్పించుకుంది. అయితే ఆ కర్ర చాటుగా నక్కి ఉన్న నక్కకి తగిలింది. బలంగా తగిలింది దెబ్బ. ఆ దెబ్బకి నక్క ప్రాణాలు పోయాయి. చచ్చిపోయిందది.- కథ ముగించాడు హిరణ్యకుడు.‘‘స్నేహం నటించి, ఎదుటి వ్యక్తికి హాని చేద్దామనుకుంటే ఆ ఆలోచన కలిగిన వాడే ఆఖరికి అంతమయిపోతా డన్నది ఈ కథలో నీతి’’ అన్నాడు హిరణ్యకుడు.‘‘అవును, నిజం’’ అన్నాడు లఘుపతనకుడు.కాకికీ, ఎలుకకీ స్నేహం అసాధ్యమని పదేపదే హిరణ్యకుడు అనడాన్ని లఘుపతనకుడు తట్టుకోలేక పోయాడు. బాధ కలిగింది.‘‘పావురాలకు నువ్వు చేసిన సాయాన్ని చూసి, నీ మంచితనాన్ని గమనించి, నీతో స్నేహం కోరుకున్నాను. అంతేకాని, నాకు వేరే దురుద్దేశం లేదు. నిన్ను తిన్నంత మాత్రాన నా ఆకలి తీరిపోదు. నీలాంటి వాణ్ణి మోసగించలేను.


 నన్ను నమ్ము’’ అన్నాడు లఘుపతనకుడు.హిరణ్యకుడు నుంచి జవాబు లేదు.‘‘నువ్వు నాతో స్నేహం చేసేదాకా నేనిక్కణ్ణుంచి కదలను. చూస్కో’’ అన్నాడు లఘుపతనకుడు.



‘‘నేనూ పావురాల రాజు చిత్రగ్రీవుడులాంటి వాణ్ణే! నన్ను నమ్ము మిత్రమా’’ ప్రాధేయపడ్డాడు. అయినా కరగలేదు హిరణ్యకుడు. స్నేహానికి ఒప్పుకోలేదు.‘‘నువ్వు నా శత్రుజాతికి చెందిన వాడివి. నీకూ నాకూ స్నేహం గిట్టదు. నీటి మీద నడిచే పడవలు, నేల మీద నడవలేవు. అలాగే నేల మీద నడిచే బళ్ళు నీటి మీద నడవలేవు. అందని మామిడి పుల్లన అనుకో! వెళ్ళిపో ఇక్కణ్ణుంచి.’’ అన్నాడు హిరణ్యకుడు. లఘు పతనకుడు కదల్లేదు అక్కణ్ణుంచి.‘‘నన్ను అపార్థం చేసుకుంటున్నావు. మంచివాడితో స్నేహం మరపురానిది. నేను మంచివాణ్ణి. నా స్నేహం నీకు బలే ఆనందాన్ని కలిగిస్తుంది. కాదంటావా, తిండీతిప్పలూ మాని కూర్చుంటాను. నిరాహారదీక్ష చేస్తాను’’ అన్నాడు లఘుపతనకుడు.హిరణ్యకుడు నుంచి ఉలుకూ పలుకూ లేదు.‘‘మంచిమనసు, త్యాగం, దయ, స్నేహం మంచి గుణాలు. అవన్నీ నీ దగ్గర ఉన్నాయి.


 నీతో స్నేహం నాకు కావాలి. నువ్వొద్దంటే చచ్చిపోతాను.’’‘‘వద్దొద్దు’’ ఆందోళన చెందాడు హిరణ్యకుడు.‘‘నీ మాటలు మంచిగంధంలాగ చల్లగా ఉన్నాయి. పన్నీటి జల్లులాగ హాయిగా బాగున్నాయి. మనసులో ఒకటి, మాటలలో ఒకటి, చేతలలో ఒకటి చేసే బుద్ధి నీది కాదనిపిస్తోంది. నీతో స్నేహం చేస్తాను. నీ స్నేహం నాకు కావాలి. ఈరోజు నుంచీ నువ్వూ నేనూ స్నేహితులం.’’ అంటూ కలుగులోంచి బయటికి వచ్చాడు హిరణ్యకుడు. లఘుపతనకుణ్ణి చూసి నవ్వాడు. అప్పణ్ణుంచీ వాళ్ళిద్దరూ మంచిమిత్రులైపోయారు. తింటే ఇద్దరూ కలిసి తినేవాళ్ళు. ప్రయాణిస్తే కలిసి ప్రయాణించేవారు. కబుర్లే కాదు, కష్టాలూ నష్టాలూ అన్నీ ఇద్దరూ కలబోసుకోసాగారు.



హిరణ్యకుడి కథ


ఒక రోజు హిరణ్యకుడూ, లఘుపతనకుడూ కబుర్లలో పడ్డారు. ఆ మాటా ఈ మాటా మాట్లాడుకోసాగారు.‘‘రోజు రోజుకీ ఇక్కడ తిండి దొరకడం కష్టంగా ఉంది. వేరే చోటుకి వెళ్ళిపోతే ఎలా ఉంటుందంటావు?’’ అడిగాడు లఘుపతనకుడు.‘‘బాగుండదేమో! పళ్ళకూ, జుట్టుకూ, గోళ్ళకూ, మనుషులకూ ఉన్న చోట ఉంటేనే బాగుంటుంది. స్థానబలిమి ఉంటుంది. మారితే బలం తగ్గిపోతుంది.’’ అన్నాడు హిరణ్యకుడు.‘‘అదంతా బలహీనుల విషయంలో. శారీరకంగా మానసికంగా బలమైన వాళ్ళు ఎక్కడున్నా, ఎక్కడికి వెళ్ళినా బాగానే ఉంటుంది. ఏనుగులూ, సింహాల్నీ చూడు, ఎక్కడికి పడితే అక్కడికి వెళ్తూ హాయిగా, ఆనందంగా ఉండట్లేదూ? అలాగే మనమూ! యేళ్ళకేళ్ళు ఉన్నచోటే ఉండడం ప్రమాదం కూడాను’’ అన్నాడు లఘు పతనకుడు.‘‘నీకిక్కడ ఉండాలని లేదు. ఆ సంగతి తెలుస్తోంది. ఎక్కడికి వెళ్ళాలని నీ ఉద్దేశం’’‘‘ఎక్కడికంటే...దండకారణ్యం ఉందా? అక్కడ కర్పూరగౌరం అని ఓ చెరువు ఉంది. ఆ చెరువులో మంథరుడు అని తాబేలు ఉంది. అతను నాకు మంచి మిత్రుడు. మంచివాడు. బుద్ధిమంతుడు. ఇతరులకు ఎన్నయినా నీతులు చెప్పవచ్చు. వాటిని మనం ఆచరించాలంటే కష్టం. అయితే మంథరుడు తను నీతులు చెప్పడమే కాదు, వాటిని ఆచరించి చూపుతాడు. పైగా దయాధర్మపరుడు.


అతనితో ఉన్న రోజుల్లో నాకొకొక్కసారి తిండి దొరికేదికాదు, అప్పుడు మంథరుడు ఏం చేసేవాడంటే... తాను పట్టుకున్న చేపల్నే నాకు కొన్ని పెట్టి ఆదరించేవాడు. పదే పదే గుర్తుకొస్తున్నాడిప్పుడు. అతని దగ్గరికి వెళ్ళిపోదామనిపిస్తోంది.’’ అన్నాడు లఘుపతనకుడు.‘‘నువ్వు వెళ్ళిపోతే నేనేం కావాలి. గౌరవం లేని చోటా, తిండి దొరకని చోటా, బంధుమిత్రులు లేని చోటా ఉండకూడదంటారు. అందుకని, నేనూ నీతో పాటు వచ్చేస్తాను. పద’’ అన్నాడు హిరణ్యకుడు.తనతో పాటు హిరణ్యకుడు వస్తానంటే లఘుపతనకుడి ఆనందానికి అంతులేకుండా పోయింది.‘‘నిజంగా వస్తావా’’ అడిగాడు.‘‘నిజంగానే వస్తాను, పద’’ అన్నాడు హిరణ్యకుడు.ఇద్దరూ బయల్దేరారు. దారిలో దొరికినవి తింటూ, కబుర్లాడుకుంటూ ప్రయాణించారు. కొన్నాళ్ళకు మంథరుణ్ణి చేరారు. దూరం నుంచే లఘుపతనకుణ్ణి చూసి పొంగిపోయాడు మంథరుడు. తోడుగా వచ్చిన హిరణ్యకుణ్ణి చూసి కూడా సంతోషించాడు. ఇద్దరికీ అతిథి మర్యాదలు చేశాడు.‘‘హిరణ్యకుడు అని ఇతను ఎలుకల రాజు. మంచివాడు.’’ మంథరునికి హిరణ్యకుణ్ణి పరిచయం చేశాడు లఘుపతనకుడు.‘‘రాజువయితే ఊరిలో ఉండాలి. అరణ్యంలో ఉండడమేమిటి? అడుగుతున్నానని ఏమీ అనుకోకపోతే అడవిలో ఎందుకుంటున్నావు?’’ హిరణ్యకుణ్ణి అడిగాడు మంథరుడు.‘‘ఎందుకుంటున్నానంటే...’’ అంటూ తన కథను ఇలా చెప్పుకొచ్చాడు హిరణ్యకుడు.‘‘అప్పట్లో నేను చంపకవతి అనే పట్టణంలో ఉండేవాణ్ణి. ఆ పట్టణంలో నాలాంటి ఎలుకలే కాదు, సన్యాసులు కూడా ఎక్కువగా ఉండేవారు. చూడాకర్ణుడు అని ఓ సన్యాసి ఉండేవాడక్కడ. అతను భోజనం చేసిన తర్వాత మిగిలిన భోజన పదార్థాల్ని ఓ గిన్నెలో పెట్టి, దాన్ని ఉట్టెలో పెట్టి నిద్రపోయేవాడు. అతనలా నిద్ర పోగానే నేనిలా ఆ ఉట్టెను అందుకుని, గిన్నెలోకి ప్రవే శించి, అందులోని భోజనపదార్ధాలన్నీ తిని త్రేన్చేవాణ్ణి. ఇది గమనించాడు చూడాకర్ణుడు. నన్ను కర్రతో బెదిరించ సాగాడు. ఒకనాడు, వీణాకర్ణుడని, చూడాకర్ణుని మిత్రుడు వచ్చాడక్కడకి. అతనితో మాట్లాడుతూ మధ్య మధ్యలో కర్రను నేలకు తాటిస్తూ కూర్చున్నాడు. పదేపదే కర్రను నేలకి తాటించి చూడాకర్ణుడు పెద్దగా శబ్దం చేయడం వీణాకర్ణునికి అంతుచిక్కలేదు.


హిరణ్యకుడి కథ


ఒక రోజు హిరణ్యకుడూ, లఘుపతనకుడూ కబుర్లలో పడ్డారు. ఆ మాటా ఈ మాటా మాట్లాడుకోసాగారు.‘‘రోజు రోజుకీ ఇక్కడ తిండి దొరకడం కష్టంగా ఉంది. వేరే చోటుకి వెళ్ళిపోతే ఎలా ఉంటుందంటావు?’’ అడిగాడు లఘుపతనకుడు.‘‘బాగుండదేమో! పళ్ళకూ, జుట్టుకూ, గోళ్ళకూ, మనుషులకూ ఉన్న చోట ఉంటేనే బాగుంటుంది. స్థానబలిమి ఉంటుంది. మారితే బలం తగ్గిపోతుంది.’’ అన్నాడు హిరణ్యకుడు.‘‘అదంతా బలహీనుల విషయంలో. శారీరకంగా మానసికంగా బలమైన వాళ్ళు ఎక్కడున్నా, ఎక్కడికి వెళ్ళినా బాగానే ఉంటుంది. ఏనుగులూ, సింహాల్నీ చూడు, ఎక్కడికి పడితే అక్కడికి వెళ్తూ హాయిగా, ఆనందంగా ఉండట్లేదూ? అలాగే మనమూ! యేళ్ళకేళ్ళు ఉన్నచోటే ఉండడం ప్రమాదం కూడాను’’ అన్నాడు లఘు పతనకుడు.‘‘నీకిక్కడ ఉండాలని లేదు. ఆ సంగతి తెలుస్తోంది. ఎక్కడికి వెళ్ళాలని నీ ఉద్దేశం’’‘‘ఎక్కడికంటే...దండకారణ్యం ఉందా? అక్కడ కర్పూరగౌరం అని ఓ చెరువు ఉంది. ఆ చెరువులో మంథరుడు అని తాబేలు ఉంది. అతను నాకు మంచి మిత్రుడు. మంచివాడు. బుద్ధిమంతుడు. ఇతరులకు ఎన్నయినా నీతులు చెప్పవచ్చు. వాటిని మనం ఆచరించాలంటే కష్టం. అయితే మంథరుడు తను నీతులు చెప్పడమే కాదు, వాటిని ఆచరించి చూపుతాడు. పైగా దయాధర్మపరుడు.


అతనితో ఉన్న రోజుల్లో నాకొకొక్కసారి తిండి దొరికేదికాదు, అప్పుడు మంథరుడు ఏం చేసేవాడంటే... తాను పట్టుకున్న చేపల్నే నాకు కొన్ని పెట్టి ఆదరించేవాడు. పదే పదే గుర్తుకొస్తున్నాడిప్పుడు. అతని దగ్గరికి వెళ్ళిపోదామనిపిస్తోంది.’’ అన్నాడు లఘుపతనకుడు.‘‘నువ్వు వెళ్ళిపోతే నేనేం కావాలి. గౌరవం లేని చోటా, తిండి దొరకని చోటా, బంధుమిత్రులు లేని చోటా ఉండకూడదంటారు. అందుకని, నేనూ నీతో పాటు వచ్చేస్తాను. పద’’ అన్నాడు హిరణ్యకుడు.తనతో పాటు హిరణ్యకుడు వస్తానంటే లఘుపతనకుడి ఆనందానికి అంతులేకుండా పోయింది.‘‘నిజంగా వస్తావా’’ అడిగాడు.‘‘నిజంగానే వస్తాను, పద’’ అన్నాడు హిరణ్యకుడు.ఇద్దరూ బయల్దేరారు. దారిలో దొరికినవి తింటూ, కబుర్లాడుకుంటూ ప్రయాణించారు. కొన్నాళ్ళకు మంథరుణ్ణి చేరారు. దూరం నుంచే లఘుపతనకుణ్ణి చూసి పొంగిపోయాడు మంథరుడు. తోడుగా వచ్చిన హిరణ్యకుణ్ణి చూసి కూడా సంతోషించాడు. ఇద్దరికీ అతిథి మర్యాదలు చేశాడు.‘‘హిరణ్యకుడు అని ఇతను ఎలుకల రాజు. మంచివాడు.’’ మంథరునికి హిరణ్యకుణ్ణి పరిచయం చేశాడు లఘుపతనకుడు.‘‘రాజువయితే ఊరిలో ఉండాలి. అరణ్యంలో ఉండడమేమిటి? అడుగుతున్నానని ఏమీ అనుకోకపోతే అడవిలో ఎందుకుంటున్నావు?’’ హిరణ్యకుణ్ణి అడిగాడు మంథరుడు.‘‘ఎందుకుంటున్నానంటే...’’ అంటూ తన కథను ఇలా చెప్పుకొచ్చాడు హిరణ్యకుడు.‘‘అప్పట్లో నేను చంపకవతి అనే పట్టణంలో ఉండేవాణ్ణి. ఆ పట్టణంలో నాలాంటి ఎలుకలే కాదు, సన్యాసులు కూడా ఎక్కువగా ఉండేవారు. చూడాకర్ణుడు అని ఓ సన్యాసి ఉండేవాడక్కడ. అతను భోజనం చేసిన తర్వాత మిగిలిన భోజన పదార్థాల్ని ఓ గిన్నెలో పెట్టి, దాన్ని ఉట్టెలో పెట్టి నిద్రపోయేవాడు. అతనలా నిద్ర పోగానే నేనిలా ఆ ఉట్టెను అందుకుని, గిన్నెలోకి ప్రవే శించి, అందులోని భోజనపదార్ధాలన్నీ తిని త్రేన్చేవాణ్ణి. ఇది గమనించాడు చూడాకర్ణుడు. నన్ను కర్రతో బెదిరించ సాగాడు. ఒకనాడు, వీణాకర్ణుడని, చూడాకర్ణుని మిత్రుడు వచ్చాడక్కడకి. అతనితో మాట్లాడుతూ మధ్య మధ్యలో కర్రను నేలకు తాటిస్తూ కూర్చున్నాడు. పదేపదే కర్రను నేలకి తాటించి చూడాకర్ణుడు పెద్దగా శబ్దం చేయడం వీణాకర్ణునికి అంతుచిక్కలేదు.


ఆమె అడిగి తెలుసుకుందో లేదో నాకు తెలియదుగాని, నేనప్పణ్ణుంచీ ఓ నిజం తెలుసుకున్నాను. ఏ పనికయినా ఏదో ఒక కారణం ఉంటుంది. కారణాన్ని కనుక్కోవాలి. విషయానికి వస్తే ఒక చిన్న ఎలుక నిన్నింతలా ఇబ్బంది పెడుతూ, అంతెత్తున ఉన్న ఉట్టెకు ఎగురుతోందంటే ఏదో కారణం ఉంది. దాన్ని కనుక్కోవాలి. అంతేకాని, కర్రను కొడుతూ కూర్చుంటే లాభం లేదు’వీణాకర్ణుడు చెప్పింది నిజమే! ఏదో బలమైన కారణం ఉంది. అనుమానం లేదనుకుంటూ ఆలోచనలో పడ్డాడు చూడాకర్ణుడు. ఆలోచించాలోచించి ఓ నిర్ణయానికి వచ్చాడు. నా కలుగును తవ్వి పారేయాలను కున్నాడు. అంతపనీ చేశాడు. పలుగుతో నా కలుగు తవ్వేసి, అందులో నేను దాచుకున్న భోజన పదార్ధాలన్నీ తీసి విసిరేశాడు. దాచుకున్నదంతా పోయింది. తిండి కరువయి పోయింది. తిండి లేక కృశించిపోయాను. నీరసించిపోయి తిరుగుతోంటే నన్ను చూసి చూడాకర్ణుడు ఇలా అన్నాడు.‘చూడూ డబ్బున్నవాడే బలవంతుడు. డబ్బున్నవాడే పండితుడు. డబ్బుంటేనే సుఖాలు. డబ్బంటే నీ దృష్టిలో తిండి. ఆ తిండి నీకు లేదు. నేను తీసి పారేశాను. దాంతో నువ్వు ఎలా అయిపోయావు? చిక్కి శల్యమయిపోయావు. అందుకే డబ్బుండాలంటారు. డబ్బు లేకపోతే డుబ్బుకి కూడా పనికిరారు. అన్నీ బాధలే! డబ్బుంటే పేరుంటుంది. పౌరుషం ఉంటుంది. తెలివి తేటలూ, బంధుమిత్రులూ ఉంటారు. అదే డబ్బులేకపోతే ఇవేవీ ఉండవు. పేదరికం కంటే చావే మేలు. పేదరికంతో ఛస్తూ బతికేకంటే చావడం అంత గొప్పపని ఇంకొకటి లేదు. ఆరోగ్యం పోయినా బతకొచ్చు. మాటపడి పోయినా బతకొచ్చు. పేరూ వూరూ పోయినా బతకొచ్చు.


 బుద్ధి మార్చుకోనంటూ మొండిగా బతకొచ్చు. కాని, డబ్బు లేకుండా బతకడం చాలా కష్టం.’చూడాకర్ణుని మాటలకి ఎంతగానో ఏడ్చాను. ఉండలేకపోయానక్కడ. చెప్పుకోలేని బాధ. డబ్బు పోగొట్టుకున్న సంగతీ, మనోవ్యథా, ఇంట్లో వాళ్ళ ప్రవర్తనా, మోసం, అవమానం ఇవేవీ నలుగురికీ చెప్పుకోలేం. దేవుని దయ లేనప్పుడు, పరిస్థితులు అనుకూలించనప్పుడు, అభిమానవంతుడు ఉన్న వూరినీ, కన్నతల్లినీ విడిచి వెళ్ళడం న్యాయమే! అభిమానం కలవాడు శిరస్సు మీద పువ్వులా ఉండాలి, లేదంటే అడవిలో పువ్వులా ఎండలో మాడి మసి అయిపోవాలి. బిచ్చమెత్తుకుని బతికే కంటే చావడం మేలు అనుకున్నాను. అయినా ఆశ చావలేదు. ఉన్న ఇంటిని వదిలిపెట్టలేకపోయాను. పొగొట్టుకున్న చోటే సంపాదించుకోవాలని తాపత్రయ పడ్డాను. ఆశ భ్రమల్ని రేపుతుంది. భ్రమలు దుఃఖాన్ని కలిగిస్తాయి. దుఃఖం మనిషిని నాశనం చేస్తుంది. అందుకే బుద్ధిమంతుడు ఆశకు అంటుకట్టడు.’’గతాన్నంతా గుర్తు చేసుకోవడంతో కళ్ళు చెమర్చాయి హిరణ్యకుడికి. అతనలా కళ్ళు చెమర్చుకోవడాన్ని చూసి లఘుపతనకుడూ, మంథరుడూ బాధగా ఒకరినొకరు చూసుకున్నారు.




దురాశ దుఃఖానికి చేటు


‘‘తర్వాత ఏం జరిగింది?’’ అడిగాడు మంథరుడు.హిరణ్యకుడు ఇలా చెప్పసాగాడు.‘‘అప్పటికీ బుద్ధి రాలేదు. అక్కడే ఉన్నానింకా. విసిగిపోయాడు చూడాక ర్ణుడు. కోపంగా ఒక రోజు నా మీదకుకర్రను విసిరాడు. తగిలితే చచ్చిపోయేవాణ్ణే! అదృష్టం బాగుండి తగల్లేదు. తప్పించుకున్నాను.అయితే అప్పటికి నాకు జ్ఞానోదయం అయింది.ఈ లోకంలో కష్టాలన్నిటికీ మూలకారణం డబ్బు, దాని మీది ఆశే! ఆ ఆశను వదులుకోగలిగితే అంతకు మించిన హాయి లేదు. ఆశలు వదులుకున్నవాడే ఉత్తముడు. పండితుడు. పదిమందిని వేధించకుండా దొరికిన దానితో పొట్టపోషించుకున్నవాడే ధన్యుడనిపించింది. చేసు కున్నవారికి చేసుకున్నంత అని, మనం చేసుకున్న పాప పుణ్యాలను అనుసరించే మనకేదయినా ప్రాప్తిస్తుంది. అంతేకాని, మనకి ఇది కావాలి, అది కావాలనుకోవడం తప్పు.నేనిప్పుడు ఉంటున్న ఈ మఠం, నా తాత తండ్రులది కాదు. నా సొంతం అంతకన్నా కాదు. అటువంటప్పుడు దీన్ని పట్టుకుని వేళ్ళాడడం అవివేకం. ఈ చూడాకర్ణుడితో మాటలు పడే కంటే, దెబ్బలు తినే కంటే ఏ అడవిలోనో తల దాచుకోవడం సుఖం అనిపించింది. బండ రాయిలో కప్పకు కూడా ఇంత తిండిపెట్టే ఆ దేవుడు, నాకెందుకు పెట్టడనిపించింది. మఠాన్ని వదిపెట్టేశాను. ఊరిని వదిలేశాను. అడవిలోకి చేరుకున్నాను. అక్కడే ఆకులూ అలములూ తింటూ, దొరికిన చోట నీళ్ళు తాగుతూ కాలం గడపసాగాను. ఆ రోజుల్లోనే ఇదిగో, ఈ లఘుపతనకుడితో స్నేహం కుదిరింది. ఆ స్నేహం నిన్ను కూడా స్నేహితుణ్ణి చేసింది. నాకు తెలిసి మిత్రులతో గడిపిన కాలమే కాలం. బంగారు కాలం అంటే అదే! దాన్ని మించింది లేదు.


ఈ ప్రపంచంలో రెండే రెండు ఆనందాలు ఉన్నాయి. ఒకటి: గొప్ప గొప్ప కథలు వినడం. రెండు: స్నేహితులతో సరదాగా తిరగడం.’’‘‘నిజం చెప్పావు’’ అన్నాడు మంథరుడు. తర్వాత మళ్ళీ ఇలా అన్నాడు.‘‘డబ్బు శాశ్వతం కాదు. అలాంటిదే యవ్వనం కూడా. ఈ రెండూ నదీ ప్రవాహంలో కొట్టుకుపోయే కట్టెల్లాంటవి. చెప్పాలంటే జీవితమే శాశ్వతం కాదు. అదో నీటి బుడగ. ఈ సంగతి తెలుసుకునే వివేకవంతులు దానధర్మాలు చేస్తూ కాలం గడుపుతారు. తెలియని వారు ఏమీ చేయక, చేసేందుకు ప్రయత్నించినప్పుడు వీలుకాక విలపిస్తారు. అవసరానికి మించి కలుగులో నువ్వు సొమ్ము దాచిపెట్టేవు. దాంతోనే అల్లరిపాలయ్యావు.నీరు ప్రవహించాలి. ప్రవాహంలోనే నీటికి అందం ఉంటుంది. అలాంటిదే డబ్బు కూడా. డబ్బుని ఎప్పుడూ ఖర్చు చెయ్యాలి. ఖర్చు చెయ్యడం అంటే విందులకూ, వినోదాలకూ ఖర్చు చెయ్యడం కాదు, దానం చెయ్యాలి దాన్ని. లేదంటే ఏదేని మంచి పనులకు ఉపయోగించాలి. డబ్బు కూడ బెట్టకూడదు. కూడబెడితే కష్టాలే! బరువును మోస్తూ తిరిగే కంటే బరువును దించుకోవడం సుఖం. డబ్బును అనుభవించాలి. లేదంటే పదిమందికీ పంచిపెట్టాలి. అంతేకాని, నువ్వూ సుఖపడక, పదిమందినీ సుఖపెట్టక కట్టకట్టలుగా డబ్బు దాచడంలో లాభం ఏముంది? పిసినారికి ఎంత డబ్బూ చాలదు. ఎంతున్నా వాడు దరిద్రుడే! నిజం చెప్పాలంటే...పిసినారికంటే దరిద్రుడే నయం. వాడి దగ్గర డబ్బుండదు కాబట్టి దానికి కాపలా కాసే కష్టం ఉండదు వాడికి. పిసినారి తాను తినడు. ఇతరులకు పెట్టడు. దాంతో ఆ డబ్బు నేలపాలు లేదంటే దొంగల పాలు కాక తప్పదు. వివేకవంతుడు డబ్బు సంపాదించాలి. కాని కూడబెట్టకూడదు. కూడబెట్టినా అవసరాల మేరకే కూడబెట్టాలి. మితి మీరి కూడబెడితే దీర్ఘరావం అనే నక్కలా నాశనమయిపోతాడు.’’


‘‘ఆ కథేంటో చెప్పవా’’ అడిగాడు హిరణ్యకుడు.‘‘చెబుతాను, విను’’ అంటూ చెప్పసాగాడు మంథరుడు.‘‘అనగనగా ఒక ఊరు. దాని పేరు కల్యాణకటకం. ఆ ఊరిలో ఓ బోయవాడు ఉండేవాడు. అతని పేరు భైరవుడు. అతను ఓ రోజు, అడవికి వేటకు వెళ్ళాడు. అక్కడ ఓ చిన్న గుంత తవ్వి, అందులో నక్కి కూర్చున్నాడు. అటుగా వచ్చే జంతువులకు ఎరగా మాంసం ముక్కలు వెదజల్లాడు. వాటికి ఆశపడి, అటుగా ఓ జింక వచ్చింది. అది రావడమే ఆలస్యం, భైరవుడు దాన్ని చంపి, ఇంటి దారి పట్టాడు. తోవలో అడవిపంది కనిపించిందతనికి. దాంతో ఈ రోజు నా అదృష్టమే అదృష్టం అనుకున్నాడు భైరవుడు. భుజాల మీది జింకను కిందికి దించాడు. పందికి బాణం గురిపెట్టి వదిలాడు. బాణం పందికి తగిలింది. అయితే అది చచ్చి పోలేదు. గాయపడి, కోపంతో భైరవుడి మీద దాడి చేసింది. పందీ-భైరవుడూ పోట్లాడుకున్నారు. ఆ పోట్లాటలో భైరవుడి ప్రాణాలు పోయాయి. తర్వాత పంది కూడా చచ్చిపోయింది. భైరవుడూ-పందీ పోట్లాటలో వారి మధ్య ఓ పాము కూడా నలిగి నలిగి పచ్చడయిపోయింది.కాస్సేపటికి దీర్ఘారావం అనే నక్క అటుగా వచ్చింది. అక్కడ చచ్చిపడి ఉన్న జింక, పంది, పాము, మనిషిని చూసి నాలిక చప్పరించింది. చాలా రోజుల దాకా తిండికి వెతుక్కోనవసరం లేదనుకుంది.మనిషి మాంసం నెలరోజుల దాకా సరిపోతుంది. పందీ-జింకల మాంసంతో రెణ్ణెళ్ళు గడిచిపోతాయి. పాము ఓ రోజుకి సరిపోతుందని లెక్కలుగట్టి ఆనందించింది. పడి ఉన్న విల్లుని చూసిందప్పుడు. దాని తాడుని నాకి చూసింది. జంతునరంతో చేసిన తాడని తేల్చుకుంది. ముందీ నరాన్ని తిని ఈ రోజు సరిపెట్టుకుంటాను. తర్వాత జింకా, పందీ, పాము వాటన్నిటినీ తినవచ్చుననుకుంది. విల్లు తాడుని మరోసారి నాకి, తినేందుకు దాన్ని కొరికింది నక్క. అంతే! తాడు తెగింది. విల్లు విచ్చుకుంది.


 ఆ విచ్చుకోవడంలో నక్కకి చెప్పలేనంత దెబ్బ తగిలింది. దాంతో నక్క చచ్చిపోయింది.’’కథ ముగించాడు మంథరుడు. ఇలా అన్నాడు.‘‘దురాశ దుఃఖానికి చేటంటే ఇదే! దురాశ కారణంగానే నక్క చావుని కొనితెచ్చుకుంది. అందుకే అంటారు, ఉన్నది అనుభవించాలి, లేదంటే ఇతరులకి ఇవ్వాలి. రెండూ చేయక చచ్చి సాధించేదేముంది?’’‘‘అవును నిజమే’’ అన్నాడు హిరణ్యకుడు.‘‘వివేకవంతులు అందని దాని కోసం బాధ పడరు. అలాగే అందింది చేజారిపోయినా బాధ పడరు. వారిలాగే నువ్వు కూడా దేని గురించీ బాధపడకు. ఎప్పుడూ హాయిగా ఆనందంగా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండు. ఉత్సాహంగా హాయిగా ఉన్నవాడే గొప్పవాడు. దిగులు పడుతూ దీనుడవుతూ కూర్చున్నవాడు ఎంత గొప్పవాడయినా పనికిరానివాడే!’’ అన్నాడు మంథరుడు. హిరణ్యకుడి ఉత్సాహాన్ని రెట్టింపు చేశాడు.



‘అనారోగ్యం వచ్చింది. మందులు వాడాలి. వాడితేనే ఆరోగ్యం కలిగేది. అంతేకాని, మందులు పేర్లు వింటే అనారోగ్యం పోతుందా చెప్పు? గుడ్డివాడి చేతిలో దీపం ఉండి ప్రయోజనం ఏమిటి? అలాగే వివేకం లేనివాడు ఎన్ని శాస్త్రాలు చదివినా అంతే!నేనున్నాను. నేను ఆపదలకు కుంగిపోను. సంపదలకు పొంగిపోను. కష్టాలూ సుఖాలూ రెండూ ఒకటే నాకు. డబ్బు వస్తుంది, పోతుంది. దాని నైజం అది. దాని గురించి ఆలోచించి బాధపడకూడదు. పేదవాడు అయినంత మాత్రాన విద్వాంసుల్ని గౌరవించకుండాపోరు. అలాగే విద్వాంసుడు కానివాడికి ఎంత డబ్బున్నా గౌరవం దక్కదు. బంగారు గొలుసుతో కట్టినంత మాత్రాన కుక్క సింహం కాదు. ఎందుకు ఇవన్నీ చెబుతున్నానంటే.. నువ్వు మంచి వాడివి. బుద్ధిమంతుడివి. ఇప్పుడు నీకొచ్చిన కష్టమేమీ లేదు. నీ గౌరవానికి కూడా లోపం లేదు. నువ్వు ఇందాక అన్నట్టుగా దేవుడు గొప్పవాడు. వాడు అన్ని జీవులకీ వేళకింత పడేస్తాడు.అనుమానం లేదందులో. అలాంటప్పుడు ఎలా బతకాలి? ఎలా బతుకుతాం? అన్న దిగులు అనవసరం.’’ అన్నాడు మంథరుడు.‘‘బాగా చెప్పావు’’ అన్నాడు హిరణ్యకుడు.‘‘నాకు ఈ లఘుపతనకుడు ఎంతో నువ్వూ అంతే! ఎందుకు కలిపాడో మన ముగ్గుర్నీ దేవుడు కలిపాడు.


 కలిసే ఉందాం. దొరికింది పంచుకుంటూ, తింటూ కాలం గడిపేద్దాం.’’ అన్నాడు మంథరుడు.‘‘మంచిమాటలు చెప్పావు మంథరా’’ మెచ్చు కున్నాడు లఘుపతనకుడు.‘‘దేవుడు గొప్పవాడు. రకరకాల జంతువుల్ని సృష్టించిన దేవుడు, ఆ జంతువుల కోసం రకరకాల ఆహార విహారాల్ని కూడా సృష్టించాడు. తిని బతకండని దీవించాడు. అది మనం పట్టించుకోం. దాచుకోవడానికి తాపత్రయపడతాం. అక్కడే చిక్కులొస్తాయి. మితిమీరిన ఆశల వల్ల దుఃఖమే కాని, ఆనందం లేదు. దీన్ని గ్రహించాలి మనం. కోటాను కోట్ల సంపద కంటే మన కన్నీటిని తుడిచే మిత్రుడే ఎక్కువ. అందుకని మనం ముగ్గురం స్నేహంగా ఉందాం. మిత్రలాభాన్ని పొందుదాం’’ అన్నాడు లఘుపతనకుడు.ముగ్గురూ ముచ్చటగా నవ్వుకున్నారు.(ఇంకా ఉంది)