మానవ సమాజంలో స్థూలంగా రెండురకాల వారుంటారు. లోకం కోసం తను వున్నానని విశ్వసించి నడచుకునేవారు, తనకోసమే లోకం వుందని ప్రవర్తించేవారు. అలాగే తాను అనుసరించిందే ‘‘ధర్మం’’ అని భావించేవారు, అసలుసిసలు ధర్మాన్ని గుర్తించి అనుసరించే వారు మనలోనే వున్నారు. మహాభారతంలో ‘‘ధర్మం’’ అనే ఏకసూత్రం అంతర్లీనంగా వుంది. దానిని పాటించే వారిని, పాటించని వారిని గమనించే ‘‘విధాత’’ పాత్ర శక్తివంతంగా సందర్భాన్ని బట్టి పని చేస్తుంది. ‘‘కాలం’’ మరొక ఆయతనంగా తన పని తాను చేసుకుంటూ పోతుంది. కాలానికి నిర్దిష్టమైన ఒక ప్రణాళిక వుంటుంది. సన్నివేశాలన్నీ ఆ ప్రణాళిక క్రమంగా జరగడానికి వీలుగా నడుస్తూ వుంటాయి.
మనుషుల రాగద్వేషాలు, బలహీనతలు సన్నివేశాలను నడిపిస్తాయి. దాని పర్యవసానమే కురుక్షేత్ర మహాసంగ్రామం.త్రేత, ద్వాపర యుగాల సంధికాలంలో అవతార మూర్తిగా ఆవిర్భవించినవాడు పరశురాముడు. అప్పటికే అహంకరించి, దుష్కర్మలకు పాల్పడుతున్న రాజవంశాలను పరశురాముడు నాశనం చేశాడు. ఆ రక్తంతో తన పెద్దలకు తర్పణలు అర్పించాడు. ఆ రుధిర ధారలతో ఏర్పడిన రక్తపు మడుగులకు శమంతక పంచకమనే పేరు వచ్చింది. ఆ నెత్తుటి గడ్డే తర్వాత కురుక్షేత్రం అయింది.ద్వాపర యుగంలో జరిగిన యీ మహాసంగ్రామంలో పద్ధెనిమిది అక్షౌహిణీల సైన్యం ప్రాణాలు కోల్పోయింది. అసలు నాటి అక్షౌహిణికి బలం ఎంత? ఒక రథం, ఒక ఏనుగు, మూడు గుర్రాలు, అయిదుగురు భటులు కలిగిన బృందాన్ని ‘‘పత్తి’’ అంటారు. అలాంటి పత్తి సమూహాలు మూడు కలిస్తే ఒక ‘‘సేనాముఖం’’. మూడు సేనాముఖాలు ఒక గుల్మం. మూడు గుల్మాలు ఒక ‘‘గణం’’. మూడు గణాలు కలిస్తే ఒక ‘‘వాహిని’’. మూడు వాహినులొక ‘‘పృతన’’. మూడు పృతనలొక ‘‘చము’’. మూడు చములొక ‘‘అనీకిని’’. పది అనీకినులు కలిస్తే ఒక అక్షౌహిణి. అంటే అక్షౌహిణిలో ఇరవై ఒక్క వేల ఎనిమిది వందల డెబ్భై రథాలు, అంతే సంఖ్యలో ఏనుగులు, మూడింతలు గుర్రాలు, లక్షాతొమ్మిది వేల మూడు వందల యాభైమంది సైనికులు వుంటారు. దీనిని బట్టి వివిధ బలాలు, సైనికులు ఎందరు నశించారో తెలుసుకోవచ్చు. కేవలం పద్ధెనిమిది రోజులు జరిగిన యుద్ధం యిది.అయితే, రెండవ ప్రపంచ యుద్ధం వల్ల జరిగిన జన నష్టంతో పోలిస్తే, కురుక్షేత్రంలో చనిపోయిన వారు తక్కువే. రెండో ప్రపంచయుద్ధంలో సైనికులు, సామాన్యులు వెరసి ఏడుకోట్ల ఇరవై లక్షల మంది మరణించారని అంచనా. ఇందులో సిపాయిలు, యుద్ధఖైదీలు, సామాన్యప్రజలు, యుద్ధం వల్ల దాపురించిన కరువు కాటకాలవల్ల మరణించిన వారు వున్నారు. యుగాలు మారినా మానవ నైజాలలో, ప్రవృత్తులలో పెద్దగా మార్పులు రావని మనకు స్పష్టంగా తెలుస్తోంది. అందుకే మన ప్రాచీన ఇతిహాసాలు నేటికీ చెలామణీ అవుతున్నాయి.మహాభారతగాథ ఒక మహాప్రవాహం. ధర్మాధర్మాల మధ్య సంఘర్షణ.
ధౌమ్యుని హితవచనాలు
తన సోదరులకు, ద్రౌపదికి పట్టిన దుస్థితికి ధర్మరాజు అపరాధ భావంతో కుంగిపోవడం ధౌమ్యముని గమనించాడు. ‘‘ధర్మనందనా, నువ్వు అనన్య సామాన్యుడవు. కాని, విధి బలీయమైనది. ఇంద్రుడంతటి వాడు ప్రచ్ఛన్నుడై నిషధాద్రిపై తలదాచుకున్నాడు. శ్రీ మహావిష్ణువు వామన రూపుడై అదితి గర్భాన జన్మించలేదా? సూర్యుడు వొకానొక సమయంలో గో గర్భంలో వొదిగి వున్నాడు కదా. తరువాత వామనుడే త్రివిక్రముడై మూడు లోకాలను ఆవరించాడు. తరుణం రాగానే సూర్యుడు స్వయం ప్రకాశంతో విశ్వానికి వెలుగులు నింపాడు. జరిగిన దానికి వగవక, విజయవంతంగా అజ్ఞాతవాసాన్ని పూర్తి చేయండి. మహారాజా, నీ మాటకు కట్టుబడి అర్జునుడు ఉదాసీనంగా వున్నాడుగాని, లేకుంటే కురుశ్రేణిని మట్టుపెట్టడం పెద్దలెక్కలోనిది కాదు- అనగానే ధర్మరాజు మనసు వొక్కసారి ఉప్పొంగింది. ‘‘ఔనౌను, మునీశ్వరా, ఔనౌను’’ అన్నాడు ఉత్సాహంగా తలవూపుతూ.పాండవశ్రేష్ఠులారా, యిప్పటివరకూ మీరు మహారాజులు. యికపై మీరు రాజకొలువులో సేవకు సిద్ధమై వెళ్లనున్నారు. అన్నమాట నిలపడానికి రాజసేవకు సంసిద్ధులు కావడం నిజంగా గొప్ప సంగతి. ఈ సందర్భంలో మీ హితాభిలాషిగా కొన్ని సంప్రదాయాలను వివరిస్తాను.
వాటిని మీరు మనసులో పెట్టుకుని ప్రవర్తిస్తే, మీకు ఎలాంటి ఆపదా వాటిల్లదు. దేశమేలే రాజుకు నేను అత్యంత సన్నిహితుడను, నాకేమని విర్రవీగడం శ్రేయస్కరం కాదు. కోటలో, కొలువులో, వృత్తి ధర్మాన్ని అనుసరించి, యెక్కడ కూర్చోవాలో, యెలాంటి ఆసనాన్ని అధిష్టించాలో గ్రహించాలి. ప్రభుచిత్తం రాజ్యభారం వల్ల రకరకాలుగా మారుతూ వుంటుంది. సమయాసమయాలను పసికట్టి అందుకు అనుగుణంగా ప్రవర్తించాలి. రాజభవనం కంటె అందమైన భవనాన్ని అన్యులెవరూ నిర్మించకూడదు. వేషభాషలలో, ఆహార వ్యవహారాలలో రాజును అనుసరించరాదు. ఒక మెట్టు దిగువన వుండడమే మంచిది. వ్యవహార శైలిలో రాజు ఆలోచనలకంటే గొప్పవి తట్టినా, వాటిని రాజుకు స్ఫురించేలా చెయ్యాలేగాని మన వ్యూహరచనలా వ్యక్తీకరించకూడదు. రాజాదరణ, దానివల్ల అధికారం, గౌరవం, ధనం లభించినపడు వాటిని అదునుగా తీసుకుని మిగిలిన వారిపై దౌర్జన్యం చేయడం ముప తెచ్చి పెడుతుంది. ప్రభువుకి యెదురుగా లేదా వెనుక నిలబడకూడదు. పార్శ్వాలలో మాత్రమే వుండాలి. వినయంగా మాట్లాడాలి. నిష్టుర వచనాలను సైతం మృదుధోరణిలో రాజుకు విన్నవించాలి. క్రోధంలో రాజు తన, మన చూడడని గుర్తెరగాలి. ప్రభువు, ప్రభుతలకు సంబంధించిన రహస్యాలను పొక్కనీయకూడదు. బయటివారి కుట్రలు తక్షణం రాజుకు అందించాలి. అంతఃపుర స్త్రీలతో, పరిచారికలతో మితిమీరిన చనువు పనికిరాదు. అపురూపమైన వస్తువాహనాలు ఏలిన వారు బహూకరిస్తేనే రాజాశ్రితులు స్వీకరించి వినియోగించుకోవాలి. రాజుగారి పొగడ్తకు అతిగా పొంగిపోకూడదు. తెగడ్తలకు కుంగిపోకూడదు. ప్రభువు అప్పగించిన బాధ్యతలను, యెన్ని అవరోధాలు వచ్చినా సకాలంలో నిర్వర్తించడానికి కృషి చెయ్యాలి. మాటలో, శరీర కదలికలో వినయం, వందనం వుట్టిపడాలి.శత్రువులు, వారి గూఢచారులు, రాజ తిరస్కృతులు, దురాలోచనాపరులు- వీరికి దూరంగా వుండాలి. భటుడు ఎపడూ అప్రమత్తుడై, తన జీవనశైలిని రాజదృష్టిలో పడకుండా కాపాడుకోవాలి. రాజు మంచివాడే కావచ్చు. కాని అంతులేని అధికారం వల్ల సంక్రమించే లక్షణాలు కొన్ని వుంటాయి. నేను అనుభవంతో చేసిన సూచనలను పాటించండి. మీరు ఆడుతూ పాడుతూ అజ్ఞాతకాలాన్ని అవలీలగా అధిగమించ గలరు’’ అంటూ దీవించాడు ధౌమ్యమహర్షి. సోదరులు మహర్షికి పాదాభివందనం చేసి, కృతజ్ఞత లు తెల్పుకున్నారు. ధౌమ్యముని మంగళ వైదిక మంత్రాలు పఠిస్తూండగా, పాండవులు, పాంచాలి ముందుకు సాగారు. దశార్ణ దేశానికి ఉత్తర దిశలో పాంచాళ దక్షిణభాగం వుంది. అక్కడ సాళ్వ, శూరసేన రాజ్యాలు వున్నాయి. అవి దాటితే కాళింది నది. నడుస్తున్న అడవిలో రకరకాల ఫలాలు, పట్టుతేనెలు, పుట్టతేనెలు వారిని సంతృప్తులను చేస్తున్నాయి. విరిసిన పుష్పగుచ్ఛాలు సుగంధ పరిమళాలతో శరీరాల సేద తీరుస్తున్నాయి. చల్లని చెట్ల నీడలలో విశ్రమిస్తున్నారు. జలపాతాల కింద, నదీనదాలలో స్నాన సంధ్యాదులు ముగించుకుని, ముందుకు సాగుతున్నారు. వారు మత్స్యదేశ పరిసరాలకు వచ్చారు. మరికొంతసేపటికి విరాట రాజ్య ముఖ్యనగరం, అందులోని రాజసౌధాలు, ఇతర భవనాలు వారికి కనిపించాయి.
ఒక్కసారిగా ధర్మరాజునకు యేదో గుర్తుకు వచ్చింది. అందరూ చెట్టునీడలో ఆగారు. ‘‘మనం గడుపబోయే అజ్ఞాతవాసంలో, యీ ఆయుధాలు మనల్ని బట్టబయలు చేస్తాయి. అర్జునుని వైపు చూసి, మన ఆయుధాలన్నీ వొక ఎత్తు! గాండీవి కోదండం వొక్కటే వొక ఎత్తు! దానిని యెవరైనా గుర్తించగలరు. క్షణాలలో మన ఉనికి తేటతెల్లమవుతుంది.’’ అన్నాడు. అల్లంత దూరంలో శ్మశాన వాటిక పక్కగా శమీవృక్షం అర్జునుని కంటపడింది. దట్టమైన కొమ్మలతో గాఢాంధకారం గూడుకట్టుకుని వున్న ఆ శమీవృక్షపంపై తమ ఆయుధాలను పదిలపరచడం మంచిదనిపించింది. ఆ చెట్టుపై కాకులు, గుడ్లగూబలు, రాబందులు చేస్తున్న ధ్వనులు భయంకరంగా వున్నాయి. మానవ సంచారం వుండని యీ ప్రాంతంలో, భీతిగొలిపే యీ జమ్మిచెట్టు సరైన తావుగా నిర్థారించారు. ధనుస్సుల అల్లెతాళ్లను తొలగించి, అమ్ముల పొదులను , కవచ కరవాలాలను, గదలను వొక చోటికి చేర్చి, తాళ్లతో బంధించి దానికి శవాకృతి కల్పించారు. ధర్మజుడు త్రిమూర్తులకు, అష్టదిక్పాలకులకు, పంచభూతాలకు, వనదేవతకు నమస్కరించి- యీ దివ్యాయుధాలు అన్యులకు భీకర విషసర్పాలుగా సాక్షాత్కరించునట్లు అనుగ్రహించండని వే డు కున్నాడు.
కుంజరయూదంబు
పాండవుల అరణ్యవాసం పూర్తయింది. ఏడాదిపాటు అజ్ఞాతవాసం సాగించాలి. అపడుగాని జూదంలో ఓడిన పాండవులకు విముక్తి లేదు. ధర్మరాజు విషాద ధోరణిలో గతాన్ని నెమరు వేసుకుంటూ వుండగా, ధౌమ్య మహర్షి ఓదార్చాడు. ‘‘ఎంతటి వారికైనా కాలం కలిసిరానపడు సమస్యలు తప్పవు. ధర్మనిర్ణయంలో, రాజ్యపాలనలో, ఔదార్యంలో నిన్ను మించిన వారు లేరు. ధర్మనందనా, ధైర్యము చిక్కబట్టి, జరగవలసిన దానిని గురించి ఆలోచించు’’ అన్నాడు మహర్షి. ధర్మరాజు ఆ మాటలకు తేరుకుని, అక్కడి వారందరికీ కృతజ్ఞతలు తెల్పి, సోదరులతో, ద్రౌపదితో అరణ్యమార్గాన ముందుకు కదిలాడు. నిరంతరం పాండవుల హితం కోరే ధౌమ్య మహర్షి వారిని అనుసరించాడు. ఒక చెట్టునీడలో విశ్రమించి, ఆ రాత్రి అక్కడే గడిపారు. మరునాడు ఉదయం ధర్మజుడు సోదరులతో తమ భవిష్యత్ కార్యక్రమం గురించి చర్చించాడు. ‘‘అజ్ఞాతవ్రతం చేయటం అంత సులభం కాదు. పైగా మనం ఆరుగురం ఒక చోటనే వుండడం శ్రేయస్కరం.’’ అన్నాడు ధర్మరాజు. ‘‘మహారాజా, నీ ధర్మనిష్ఠకు మెచ్చి ధర్మదేవత తమకు అనుగ్రహించిన వరం వుంది కదా, మనల్ని ఎవరూ గుర్తించ లేరు. పాంచాల, మత్స్య, సాళ్వ, విదేహ, బాహ్లిక, శూరసేన, కళింగ, మగధ దేశాలలో మనం ఎక్కడైనా అజ్ఞాతవాసాన్ని పూర్తి చేయవచ్చు. ఆ దేశ జనపదాలలో మనం యథేచ్ఛగా వుండవచ్చు గదా’’ అన్నాడు అర్జునుడు.సోదరుని సూచన అందరకూ నచ్చింది. ‘‘నీవు చెప్పింది బావుంది. నాకు మత్స్యదేశం ఆమోదయోగ్యం అనిపిస్తోంది. ఆ దేశాధిపతి విరాటరాజు అన్ని విధాలా యోగ్యుడని విన్నాను. విరటుని కొలువులో మనం ఏ విధంగా చేరాలో ఆలోచించి చెప్పండి’’ అన్నాడు ధర్మరాజు.
తిరిగి వెంటనే, ‘‘నేను కంకుభట్టు అనే పేరుతో పుణ్యపురాణ గోష్ఠి జరిపే బాధ్యతను స్వీకరిస్తాను’’ అంటూ సవివరంగా చెప్పాడు. భీముడు చిరునవ్వుతో ‘‘సోదరులారా, నేను పాకశాలలో చేరి రాజుగారి జిహ్వను ఆకట్టుకుంటాను. వచ్చే పోయే అతిథులను సైతం రకరకాల వంటకాలతో అలరింపజేస్తాను. ఇకపై నా పేరు వలలుడు’’ అనగానే ద్రౌపది తన పెదాలపైకి అప్రయత్నంగా వచ్చిన చిరునవ్వును దాచుకుంది. పాండవ మధ్యముడు అర్జునుడు తన సంగతి వివరించాడు. ‘‘అమరావతికి వెళ్లినపుడు అక్కడ అప్సరస ఊర్వశి నన్ను నపుంసకుడవు కమ్మని శపించింది. కాని ఆ శాప ఫలితాన్ని నా అభీష్టానుసారమే అనుభవించవ చ్చని ఇంద్రుడు నాకు మాట యిచ్చాడు. ఇప్పుడు ఆ శాపాన్ని వరంగా మార్చుకుంటాను. పేడిరూపుతో, బృహన్నల పేరుతో నాట్యాచార్యునిగా విరటుని కొలువులో చేరతాను. లాస్యచాతురిని ప్రదర్శించి, అంతఃపురంలో తిష్ఠ వేస్తాను’’ అనగా అందరూ ఆ ఆలోచనను మెచ్చుకున్నారు. అశ్వశిక్షకునిగా దామగ్రంథి పేరుతో విరటుని కోటలో స్థానం సంపాదిస్తాను అన్నాడు నకులుడు. తంత్రీపాలుడనే పేరుతో మత్య్సదేశాధీశుని గోశాలలో చేరతానన్నాడు సహదేవుడు. ఇక మిగిలింది ద్రౌపది. పాండవుల ముఖాలు వివర్ణం కావడం గమనించిన ద్రౌపది చిరునవ్వుతో, ‘‘సైరంధ్రీ వేషధారినై మత్స్యభూపతి పట్టమహిషి వ్యక్తిగత పరిచారికగా సేవలందిస్తాను’’ అన్నది. ధర్మరాజు ద్రౌపదికి, సోదరులకు తీసుకోవలసిన జాగ్రత్తలన్నీ వివరించాడు. ‘‘రాజ దర్పాలను, బలపరాక్రమాలను బహిర్గతం కాకుండా కప్పిపుచ్చండి. మన అజ్ఞాతవాసాన్ని భంగపరచడానికి కౌరవ వర్గం అనుక్షణం ప్రయత్నిస్తూ వుంటుందని నిద్రలో కూడా మరువకండి’’ అని మరొకసారి అందరినీ అప్రమత్తం చేశాడు. ఎవరిదారిన వారు విరాట కొలువుకి బయలుదేరబోతున్న తరుణంలో ధౌమ్యమహర్షి వారికి కొన్ని హితోక్తులు యెరుక పరిచాడు.
కీలక వృత్తులలో
పాండవులు, ద్రౌపది ముందుగా సిద్ధం చేసుకున్న పథకం ప్రకారం విరాటరాజు కొలువులో చేరారు. మొదట కంకుభట్టారక పేరుతో విరటుని ముఖ్యసలహాదారునిగా, రాజుకి కుడిబుజమైనాడు. భీముడు కమ్మటి భోజనానికి లోటు లేకుండా వలలుడు పేరుతో వంటశాలను కైవసం చేసుకున్నాడు. పాండవ మధ్యముడు బృహన్నలగా, ఆస్థాన నాట్యాచార్యునిగా గజ్జెకట్టాడు. అశ్వహృదయాలను పసికట్టగల చాతుర్యం వుందని నకులుడు దామగ్రంథి అనే మారుపేరుతో అశ్వశాలను ఆక్రమించాడు. గోశాలలో గోసేవకు సహదేవుడు తంత్రీపాలుడు అయ్యాడు. ద్రౌపది పట్టమహిషి సుధేష్ణకు సపర్యలు చేసే దాసిగా మాలిని పేరుతో అంతఃపురంలో స్థిరపడింది. వారు ఆరుగురు విరాటకోటలో అలా చేరడంలో వ్యూహం వుంది. ఎల్లపడూ రాజు సరసన వుండే కంకుభట్టారకునికి లోకవిషయాలు ఎప్పటికపడు తెలుస్తూ వుంటాయి. వృకోదరుని భోజన పరాక్రమం చూస్తే, ఎవరైనా భీమునిగా యిట్టే పసికట్టగలరు. ఇపడు వండివార్చేదీ, పాకశాలలో తొలిగా రుచులు చూసేదీ తనే. కనుక సమస్యలేదు. అర్జునుడు అంతఃపురానికి, వుద్యానవనాలకు పరిమితమైనాడు. లోకవ్యవహారాలు మొదట అంతఃపురాలలోనే పొక్కుతాయి.
ద్రౌపది పట్టమహిషి సేవలోనే వుంటుంది కాబట్టి ఆమెకు తెలియని విశేషాలు వుండవు. అశ్వశాలకు తెలియకుండా రథం కదలదు. కనుక దేశంలో గాని, సరిహద్దుల్లో గాని ఏమాత్రం అలజడి అయినా మొదట తెలిసేది అశ్వశాలకే! అక్కడ నకులుడు వున్నాడు. ఆ రోజుల్లో రాజ్యసంపదలంటే భూమి, గోవులు మాత్రమే. గోధనం సహదేవుని పర్యవేక్షణలో వుంది.అంటే అజ్ఞాతవాసంలో వున్న పాండవుల చేతిలో ఆ రాజ్యపు ఆయువు పట్లు అన్నీ వున్నాయి. దుర్యోధనుడు తన అనుచరులతో వీరి అజ్ఞాతదీక్షను భగ్నం చేసి, మళ్లీ శిక్షను మొదటికి తీసుకు రావడానికి ప్రయత్నిస్తూనే వుంటాడని వీరికి తెలుసు. విరటుడు చాలా చిన్నరాజు. కురు రాజు తలచుకుంటే విరటుడు యెదురు నిలువలేడు. కాని, యిపడు ప్రచ్ఛన్నులై పాండవులు ఆ రాజ్యంలో రాజు నీడలో తలదాచుకున్నారు. ప్రభువు తలలో నాల్కలై వారు నడుచుకుంటున్నారు. సుభిక్షంగా రోజులు గడుస్తున్నాయి.విరాటరాజు నిండుసభలో కొలువు తీరి వున్నాడు. భారీకాయంతో, తాబేళ్లవలె కదలుతున్న కండలతో వచ్చిన వ్యక్తి మహారాజుకి వినమ్రుడై నమస్కరించాడు. ‘‘మహారాజా, నన్ను జీమూతుడు అంటారు. మల్ల యోధుడను. నేల నాలుగు చెరగులా తిరిగి, నాతో తలపడగల వీరుడు దొరక్క విసిగి వేసారి పోయాను. చివరి ప్రయత్నంగా తమ సన్నిధికి వచ్చాను. తమ ఆస్థానంలో నాకు సరిజోడీగా నిలబడగల ధీరుడుంటే రప్పించండి. నా బలప్రదర్శన ద్వారా తమకు వినోదం పంచుతాను. దానితోపాటు నా శక్తిసామర్థ్యాల నిరూపణకు మంచి అవకాశమూ వస్తుంది’’ అన్నాడు. ఆ యోధుని మాటలు విన్న మహారాజు కొలువును కలయ చూశాడు. ఆస్థాన మల్లులు తలలు వంచి తమ అసహాయతను మౌనభాషలో వెల్లడించారు. మహారాజు తలదించుకుని, ఆలోచనలో పడ్డాడు. అంతా గమనిస్తున్న కంకుభట్టు ‘‘మహారాజా, మన పాక నిపుణుడు యితనికి దీటైన వాడుగా తోస్తోంది. అతన్ని రప్పించండి’’ అని సవినయంగా సూచించాడు. మరుక్షణం వలలుడు మల్లరంగంలో సిద్ధంగా నిలిచాడు. యోధులిద్దరూ జబ్బలు చరుచుకుంటూ పరస్పరం కలబడ్డారు. రకరకాల మల్లబంధాలతో చిత్రవిచిత్రగతులతో వలలుడు విజృంభించాడు. జీమూతుడు తట్టుకోలేక మూల్గులతో నేలకొరిగాడు. విజయాన్ని వరించిన వలలుడు ఆతని మూపున మోకాలుంచి, గర్వంగా సభాసదులను పరికించాడు. కరతాళ ధ్వనులు మిన్నుముట్టాయి. రాజుగారికి, అన్నగారికి వినమ్రంగా నమస్కరించాడు. మహీపతి తన పరువును, రాజ్యప్రతిష్టను నిలిపినందుకు వలలుని ఉచితరీతిన సత్కరించాడు. సమయానికి తగు సూచన చేసిన కంకుభట్టారకుని మనసా అభినందించాడు. ఆనందం వొకవైపు, నిజరూపాలు బయట పడతాయనే భయం మరొకవైపు సోదరులను అనుక్షణం ఆవరిస్తున్నాయి. వారి వారి మారువేషాలలో, అద్భుతంగా పాత్రపోషణ చేస్తూ, అజ్ఞాతవాసంలో పదిపున్నములను వె ళ్లదీశారు. ఇక రెండు మాసాలు గడిస్తే, గడ్డుకాలం పూర్తవుతుంది- అని వారు వూరట చెందుతూ, రోజులను లెక్కలు కడుతూ వుండగా....
సింహబలుడు
విరాటరాజు పట్టమహిషి, సహోదరి అయిన సుథేష్ణాదేవిని చూడడానికి కీచకుడు అంతఃపురానికి వచ్చాడు. వచ్చీరాగానే వాని దృష్టి ద్రౌపదిని సోకింది. మహావీరుడు, సింహబలుడుగా పేరుగాంచిన కీచకుడు రాజుగారి బావమరిది. పైగా విరటుని సర్వసేనాధిపతి. రాజ్యానికి కీచకుడు పెద్ద అండ. సోదరిని ‘‘కొత్తగా వచ్చి, అంతఃపురానికే వినూత్న శోభ తెచ్చిన యీమె ఎవరు?’’ అని అడిగాడు సింహబలుడు. రాక్షస ప్రవృత్తిగల సోదరుని ఆంతర్యం గ్రహించిన సుథేష్ణ తడబడింది. కీచకుడు కనుబొమలు సారించి, రెప్పవేయక పాంచాలిని చూస్తున్నాడు. మహారాజుకి అతడే కండబలం, అతడే మనోబలం. పైగా ఎంతో కావల్సిన వాడు. మాలిని కేవలం అక్కగారి దాసి. కనుక, తను మనసు పడితే భంగపడే అవకాశమే లేదు. కీచకుని చూపులు ముళ్లవలెద్రౌపదిని గుచ్చుకుంటున్నాయి. వాని హావభావాలు, వాగ్ధోరణి కంపరం పుట్టిస్తున్నాయి. అప్పటికీ ఆమె అలక్ష్యం చేసి, రోషాన్ని దిగమింగి- ‘‘అన్నా, అక్క చెల్లెళ్లున్న వాడివి. నేను హీనవంశంలో పుట్టి, దాసి వృత్తిలో వున్నదానిని. నా యీ వేషభాషలు నీకు జుగుప్స కలిగించడం లేదా మా రాజా’’ అన్నది దీనంగా. కీచకుడు మాలిని మాటలకు విలాసంగా నవ్వాడు. అంగాంగ వర్ణనలో ఆమెను పొగిడి, తిరుగులేని తన కోర్కెను ముఖాముఖి వివరించాడు.
ద్రౌపది సింహబలుని దుర్భాషలను సహించలేక పోయింది. ఆగ్రహావేశాలు కమ్ముకున్నాయి. మర్యాదలు పక్కన పెట్టి, పరుష స్వరంతో, ‘‘కీచకా, నా భర్తలు అయిదుగురు. వారు శౌర్యనిధులు. శత్రు సంహార విద్యలో విశారదులు. దేవ అంశగల గర ధర్వులు. సాక్షాత్తూ ఇంద్రాదులు దిగివచ్చి, నీకు అభయం ఇచ్చినా ప్రయోజనం వుండదు. నీ మంచికోరి చెబుతున్నాను. రవంత ముందు వెనకలు ఆలోచించుకో. అధికార బలంతో, బల గర్వంతో అహంకరించి చావుని గడపలోకి పిలుచుకోకు సుమా’’ అని హెచ్చరించింది. సింహబలుడు హేలగా నవ్వి, ఆమె మాటలను తృణప్రాయంగా తీసి పారేశాడు. పరస్ర్తీలను ఆశించిన దుష్టాత్ముల బతుకులు ఎలా ముగిశాయో ద్రౌపది చెప్పింది. కీచకుడు నిర్లక్ష్యంగా సోదరి సుథేష్ణ దగ్గరకు పోయి, ‘‘ఆ జవ్వని నా వశం కావాలి. నీదే భారం’’ అన్నాడు. సుథేష్ణ పరిపరి విధాల నచ్చజెప్పడానికి ప్రయత్నించి, విఫలమైంది.మూర్ఖుని మనసు మార్చలేమని పట్టపురాణికి అర్థమైంది. మాట మీద మాట పెరగడం తప్ప, సమస్య పరిష్కారం కాదని తేటతెల్లమైంది. సోదరుని అనునయంగా చల్లబరిచింది. ‘‘నాయనా, కేవలం వొక దాసి పొందుకోసం నీవు యింతగా తపించనేల? మనమూ మన అంతస్తూ దృష్టిలో పెట్టుకుని నీకు చెప్పానుగాని, వేరేమీ కాదు. నాకు కొంచెం వ్యవధి యిస్తే, ఆమెను నయానో భయానో దారికి తెస్తాను. ఏదో వంకతో నీ మందిరానికి పంపుతాను’’- అంటూ వూరట పరిచింది మహారాణి. ఆ క్షణానికి యీ ఆపదకు తెరపడింది. తన ప్రాసాదానికి మరలి వెళ్లిన సింహబలుడు మాత్రం క్షణాలు లెక్కపెడుతున్నాడు. ఆ సౌందర్యరాశి రాకకోసం నిరీక్షిస్తున్నాడు. మందిరంలో ఎక్కడ అడుగుల సవ్వడి వినిపించినా సింహబలుడు వుత్సాహంగా, ఆత్రుతగా చూపులు సారిస్తున్నాడు. సోదరుని బుద్ధి సుథేష్ణకు పూర్తిగా తెలుసు. సింహబలుని తిరస్కరించి సింహాసనాన్ని కాపాడుకోవడం దుర్లభం. సుథేష్ణ తన భవనంలో అడుగు పెట్టినపుడే, మాలినిని వ్యక్తిగత పరిచారికగా వుంటుందని, భవనం దాటి వెళ్లే పనులు చెప్పనని మాట యిచ్చింది. ఇప్పడు మహారాణికి ముందు నుయ్యి, వెనుక గొయ్యిలా తయారైంది. ఇక చేసేది లేక, మాలినిని పిలిచి కీచకుని భవనానికి వెళ్లి మద్యం తీసుకు రమ్మని ఆదేశించింది. ద్రౌపది తన ముఖ కవళికలలోనే అయిష్టతను వ్యక్తం చేసింది. రాణి యిచ్చిన మాటను వినయంగా గుర్తు చేసింది. సుథేష్ణ మరపు నటిస్తూ లౌక్యాన్ని ప్రదర్శించింది. ‘‘ఔనౌను. ఇలాంటి పనులు నీకు చెప్పనని నాడే చెప్పాను. అత్యవసరమై మాట మరచి నీకు చెప్పాను. అయినా అదేమీ పరాయి చోటు కాదని భావించాను’’ అంటూ, అందులో నిష్ఠూరాన్ని, అపరాధ భావననీ ధ్వనింప చేసింది. ‘‘రాణి కరకుగా వున్నా దాసి వుండకూడదు. అజ్ఞాతవాసంలో మగ్గేటపడు యివన్నీ తప్పవు’’ అని ద్రౌపది మనసు దిటవు చేసుకుని మదిర పాత్రతో సింహబలుని నివాసానికి బయలు దేరింది.
బెబ్బులి గుహలో అడుగు పెట్టిన ఆడలేడిలా ఆమె బెదురుతూ లోనికి అడుగు పెట్టింది. సైరంథ్రిని చూడగానే సింహబలుని హృదయంలో హర్షావేశం తాండవించి, అది ముఖమంతా ప్రతిఫలించింది. వెంటనే తన విశాల వక్షస్థలం మీది ముత్యాల హారాలను సద్దుకుని, ఆమెకు యెదురు వెళ్లాడు. మాలిని ముక్తసరిగా వచ్చిన పని చెప్పింది. సింహబలుడు తన ధోరణిలో మాటలు మొదలు పెట్టాడు. సైరంథ్రి సౌందర్యాన్ని పొగిడాడు. తన బలాన్ని, బలగాలని ఏకరువు పెట్టాడు. అధికారాన్ని, తనకు గల ఐశ్వర్యాన్ని వివరించాడు. అపూర్వ మణి మాణిక్యాలతో శరీరాన్ని పొదగగలనన్నాడు. భవనాలు, ఉద్యానవనాలు, వస్తువాహనాలు లెక్కకు మిక్కిలిగా నీ సొంతం చేయగలనన్నాడు. నా కులకాంతలే నీకు చెలికత్తెలై నిన్ను సేవిస్తారు. నేను సైతం అడుగులకు మడుగులొత్తుతాను. సైరంథ్రీ, సరేనని వొక్కమాటతో నా వీనులకు విందు చేయవా - అని ప్రాధేయపడ్డాడు. శిలాప్రతిమలా నిలబడిన సైరంథ్రిని చూసి మదనోన్మాదంతో వివశుడై మరో అడుగు ముందుకు వేశాడు. ద్రౌపదిని బలమైన తన చేతులతో బంధించ యత్నించాడు.తన సమస్త శక్తులను తృటికాలంలో కూడతీసుకుని, ద్రౌపది ఒక్కసారిగా కీచకుని విసిరి కొట్టింది. అంతటి శక్తిని ఆమెలో సింహబలుడు వూహించలేదు. అనుకోని పరిణామానికి కీచకుడు పురుగులా దూరంగా పడ్డాడు. రెప్పపాటులో భవనం దాటి రాజవీధిలోకి నడిచింది పాంచాలి. కీచకుడు క్రోధావేశంతో లేచి, ఆమెను పెద్ద పెద్ద అంగలతో వెంటాడాడు. భీతితో మాలిని రాజవీధిన పరుగు వంటి నడకతో, కంట నీరు వొత్తుకుంటూ సాగుతోంది.
అరణ్య రోదన
పట్టపగలు రాజవీధిలో ఒక మగువను వెంటాడి, వేటాడుతున్న సింహబలుని అడ్డుకునే వారే లేకపోయారు. అదిరాచనగరమా, కీకారణ్యమా! రాజబంధువులకు, రాజాశ్రితులకు నీతినియమాలు, ధర్మాధర్మ విచక్షణలు వుండవు కాబోలు- మనసులో రోదిస్తూ వడివడిగా పరుగిడుతోంది మాలిని. కొంతదూరం వెళ్లగానే కీచకుడు ఆమె కొపను చేజిక్కించుకున్నాడు. వుచితానుచితాలు వానికి తెలియవు. హీనస్వరంతో ద్రౌపది ఆర్తనాదాలు చేసింది. అంతా అరణ్యరోదనమే అయింది. అంతటి అవమాన వేళ, నిస్సహాయతలోంచి భగవదనుగ్రహంలాగా ఎక్కడలేని శక్తీ పుట్టుకు వచ్చింది. అంతటి మహాబలుడూ ఆమె ధాటికి తట్టుకోలేక నడివీధిన బోరగిలపడ్డాడు. ఆ భంగపాటుకు తత్తరపోయాడు. ఆ శక్తికి నివ్వెరపోయాడు. పురజనుల కంటపడితే అవమానం, అప్రతిష్ట అనుకుని, హతాశుడై దెబ్బతిన్న త్రాచులా బుసల నిట్టూర్పులతో కదిలాడు.సరిగ్గా, యీ ఆపదవేళ విరటుడు కొలువుతీరి వున్నాడు. ధర్మజ, భీమసేనులు సభామందిరంలో వున్నారు. ద్రౌపది నడివీధిన యెదుర్కొన్న ఘోరపరాభవాన్ని వారు ప్రత్యక్షంగా చూశారు. వలలుని కన్నులలో దారుణ ఆగ్రహ జ్వాలలు రాజుకున్నాయి. బ్రహ్మాండభాండాన్ని చిదిమి వేయాలన్నంత వుద్రేకం అతని పిడికిళ్లలో వ్యక్తమవుతోంది. ఆకాశాన్ని, భూమిని చెరొక చేతా పట్టుకుని తాళాలుగా మోగించాలన్నంత విజృంభణ అతనిలో నిలువెల్లా ద్యోతకమవుతోంది. అజ్ఞాతవాసంలో అణగిమణ గి వున్న భీమన్నలో నిగ్రహం, నియమం కట్టలు తెంచుకున్నాయి. సభామందిరం పక్కన వున్న మహావృక్షం వైపు రెండు అంగలలో నడిచాడు. కీచకుని రాజసముఖంలోనే పరిమార్చాలని నిర్ణయించుకున్నాడు.
సింహబలుని శక్తిసామర్థ్యాలతో రాజ్యాన్ని పాలించే యీ రాజు వాడికేమి యెదురు చెప్పగలడు? మహావృక్షాన్ని కూకటివేళ్లతో పెకిలించడానికి వుద్యుక్తుడైన భీముడు, అక్కడే వున్న అగ్రజుని ఆనతికోసం చూశాడు. ధర్మజుడు కనుసైగతోనే తమ్ముని వారించాడు. సభలోని వారంతా వలలుని వుద్రేకాన్ని గమనించి, కారణం తెలియక తికమక పడుతున్నారు. కంకుభట్టు సమయ సందర్భాలను గ్రహించి, పెద్దగా నవ్వి నర్మగర్భంగా ‘‘పాకప్రవీణా, వంటచెరుకు కోసం పచ్చని చెట్లను పెకిలిస్తావా? వచ్చేపోయేవారికి తీయని పండ్లను, చల్లని నీడను యిచ్చే దానిని నిర్మూలించడం ధర్మం కాదు. ఎక్కడైనా ఎండిన మానులుంటే చూసుకో. లేదంటే భటులకు పురమాయిస్తే వారే సమకూరుస్తారు కదా!’’ అన్నాడు. ఆ మాటలలోని ఆంతర్యం బోధపడి, భీముడు కొంచెం చల్లబడ్డాడు. మరి గత్యంతరం లేని పాంచాలి విరటుని కొలువుకు వచ్చి నిలిచింది. కనుల నీరు తిరుగుతున్నాయి. అక్కడే వున్న ధర్మరాజుని, భీముని చూడనట్టే చూసింది. రాజుని, సభాసదులను ధీరగంభీరస్వరంతో సంబోధించింది. నా గర ధర్వపతులు అయిదుగురూ ధర్మవేత్తలు. దుష్టశిక్షణలో, శిష్టరక్షణలో ఆరితేరిన శూరులు. పరాక్రమంలో, శస్త్రాస్త్ర సంపదలో వారికి వారే సాటి. వారు నేడు నాకింతటి ఘోరపరాభవం జరిగినా, ఏమీ తెలియనట్టే వుపేక్షించి వూరుకున్నారు. మరి యింతటి అండదండలుగల నాకే యిట్టి స్థితి దాపురిస్తే, యీ రాజ్యంలో సాధారణ స్త్రీల గతియేమిటి? యీ నేలపై సౌశీల్యగౌరవాలతో మగువ మనగలదా? ఇందరు సదస్సులలో ఏ ఒక్కరికైనా కీచకుని దుశ్చర్య ఏవగింపు కలిగించలేదా? మత్స్యదేశాధిపతి విరాట మహీపతి ధర్మాధర్మ విచక్షణ గలవారు. ఏలినవారు సైతం కీచకుని అకృత్యాన్ని చూసీచూడనట్టు వ్యవహరించడం నా దురదృష్టం’’ ఆమె కంఠం గద్గదికమైంది. సభ మ్రాన్పడిపోయింది. మౌనముద్రతో తలవాల్చింది.విరటుడు ద్రౌపది స్థితికి జాలిపడ్డాడు. సింహబలుని హెచ్చరించగల ధైర్యం ఆయనకు లేదు. ఒక సాధారణ దాసి, నిండుకొలువులో రాజుని నిర్భీతిగా నిలదీసినా ఆయన ఆగ్రహించలేదు. విరటుడు సింహబలుని అతిసున్నితంగా మందలించి, నచ్చజెప్పే ధోరణిలో మాట్లాడి పంపించాడు. అణచుకున్న అక్కసుతో, కోపంతో వూగిపోతూ కీచకుడు తన నివాసానికి కదిలాడు. సభామండపం దిగి వెళ్లేవేళ, నిర్లక్ష్యంగా తలతిప్పి, ద్రౌపదిని తీక్షణంగా చూశాడు. ఆమె అస్సలు లక్ష్యపెట్టలేదు. సింహబలుని నిష్క్రమణతో సభ స్వేచ్ఛగా వూపిరి పీల్చుకున్నది. రాజు ముఖంలో అపరాధనా భావం ప్రస్ఫుటంగా కనిపిస్తున్నది. కాని నిస్సహాయుడు. మానవతికి అభయమివ్వగల ధైర్యం లేదు. మదోన్మత్తుని సమర్థించేంతటి దుర్బుద్ధిలేదు. ఆ క్షణాన రాజు అడకత్తెరలో పోక.
సభాసదులు తమకు తోచిన విధంగా గుసగుసలాడుకుంటున్నారు. అసలింతటి సౌందర్యరాశి సైరంథ్రిగా కుదరటమేమిటోనని కొందరు ముక్కున వేలేసుకున్నారు. పట్టపగలు దేశసేనాధిపతే యింతటి అమానుషానికి పాల్పడడమా, కంచే చేను మేసినట్టుంది- అని కొందరు వ్యాఖ్యానించారు. అసలు రాజు అసమర్థుడైనపడు యిలాగే వుంటాయని కొందరు వ్యంగ్యధోరణిలో మాట్లాడారు. ‘‘సుధేష్ణాదేవి వుపేక్షించి, ప్రోత్సహించడమే దీనికి కారణం’’ అన్నారు కొందరు. విజ్ఞులు రకరకాలుగా చర్చించారు. అందరూ జరిగిన ఘటనను తీవ్రంగా పరిగణించారు. కాని పెదవి విప్పి పరుషంగా మాట్లాడే ధైర్యం రాజుకే లేకపోయె. సాత్వికులైన సభికులు బాధతో, జాలితో తలలు వంచి నిట్టూర్చారు. అంతకుముందే ధర్మజుని మనసులో రోషం కోడెత్రాచై, పైకెగసి బుసకొట్టి, పడగ విప్పి, కోరసాచింది. ఆయన నుదుటిపై స్వేదం కమ్ముకొని, అది రోషమై, జాలియై, నిస్సహాయతయై, నీటికంటె పల్చనై చెంపలపైకి జారింది. ఆ గంభీరమూర్తి అరచేతితో స్వేదబిందువులను అద్దుకుని, ప్రశాంతవదనంతో, మృదుస్వరంతో-‘‘సాధ్వీమణీ, మహారాజుతోబాటు సభాసదులంద రూ నీకు జరిగిన అవమానానికి చింతిస్తున్నారు. ఇక ఎక్కువగా తర్కించడం వల్ల ప్రయోజనం ఏముంది? రాణిగారి మందిరానికి వెళ్లి వూరట చెందడం మంచిది. నీ గంధర్వపతులు విశ్వాన్నే జయించగల సమర్థులని పదేపదే చెబుతున్నావు. వారు ఆగ్రహంతో ప్రజ్వలించడం ప్రస్తుత పరిస్థితిలో శ్రేయస్కరం కాదని నా భావన. పెద్దల సాన్నిధ్యంలో నీవంటి వుత్తమ యిల్లాలికి యీ వైఖరి తగదు సుమా’’ అని హితవు పలికాడు. ఆమె ధర్మజుని మాటలు విని మరింత రోషపడింది. అది గ్రహించిన పాండవాగ్రజుడు, ‘‘సైరంథ్రీ, సభామధ్యంలో నర్తకి వలె ప్రవర్తించకు. కులసతివలె మీ రాణిగారి సేవకు బయలుదేరు’’ అన్నాడు హెచ్చరికగా.మాలిని సాభిప్రాయంగా చూసి, ‘‘కంకుభట్టారకా! నా ప్రాణేశ్వరుడొకరు నటశేఖరులు! అందుకే నేను నర్తకినైనాను. పతిపాండిత్యమే నాకు కొంత సంక్రమించింది. అంతేకాదు, నా భర్త నాట్యవిద్యతోబాటు ద్యూతకేళిలో ప్రవీణుడు. జూదరి ఆలికి పదిమందిలో గౌరవమర్యాదలతో నడచుకోగల మెళకువలుంటాయా?’’ అన్నది. ఆ మాటలకు ధర్మజుని ముఖం వివర్ణమైంది.
వ్యూహరచన
ద్రౌపది తనకు జరిగిన పరాభవానికి దుఃఖిస్తూ, తలదించుకుని అక్కడ నుంచి కదిలింది. సుధేష్ణాదేవి మందిరానికి వెళ్లింది. రాణి మహా గడుసరి. ఏమీ తెలియనట్టే ‘‘మాలినీ, ఏమైంది? ముఖం అట్లా వుందేమిటి? జుత్తు రేగిందెందుకు? దుస్తులనిండా మట్టిమరకలు పడ్డాయే’’ అని అడిగింది. పాంచాలి లోకజ్ఞత తెలీని మూర్ఖురాలు కాదు. ‘‘ఆహా, ఎంతటి నంగనాచి! గొప్పవారికి యెట్లా మాట్లాడినా చెల్లిపోతుంది కాబోలు’’ అని నిట్టూర్చింది. పైగా సుధేష్ణ, సింహబలుల జన్మవృత్తాంతాలు ఆమెకు తెలియనివి కావు. కీచకుని తండ్రి సూతదేశాధీశుడు. మాళవ రాజ్య కన్య మాళవి వలన సూతాధీశునికి నూట ఆరుగురు పుత్రులు కలిగారు. పెద్దకొడుకు కీచకుడు. మిగిలిన నూట అయిదుగురు ఉపకీచకులుగా సోదరునికి నీడలా వుంటారు. మాళవి చెల్లెలి కుమార్తె సుధేష్ణ విరాటరాజు పట్టమహిషి. కండబలం గుండెబలం వున్న కీచకునికి సింహబలుడు అన్వర్థ నామధేయంగా ప్రచారంలోకి వచ్చింది. విరటునికి అండదండలుగా, కీచకుడు తన సహోదరులు ఉపకీచకులతో సహా మత్స్యదేశంలోనే స్థిరపడ్డాడు. రాజుకి సింహబలుడంటే వాత్సల్యంతోబాటు భయం కూడా. అందుకే అతను ఆడింది ఆట, పాడింది పాట. అందుకే తను సైరంథ్రి వృత్తిలో చేరేటపడు విధించిన ఆంక్షలను తోసిరాజని కీచకుని మందిరానికి సుధేష్ణాదేవి పంపింది. ఇపడు ఏమీ తెలియనట్టు యోగక్షేమాలు అడుగుతోంది. రాజ్యాధికారం చేతులో వుంటే ఏది చేసినా చెల్లుతుంది కదా- అని గాఢంగా నిట్టూర్చింది పాంచాలి.తన నివాసానికి వెళ్లి, విధిని నిందిస్తూ ద్రౌపది జరగవలసిన దానిని గురించి ఆలోచించసాగింది. ‘‘సింహబలుని పీచమణచగల సమర్థుడు భీముడు వొక్కడే’’ అని తీర్మానించుకుంది. కంటిపైకి కునుకు రావడం లేదు. గుండె రగులుతోంది. కోట వాకిట నుంచి వినిపిస్తున్న గంటలు అర్ధరాత్రిని సూచిస్తున్నాయి.
అంతఃపురం గాఢనిద్రలో జోగుతోంది. చీకటి, నిశ్శబ్దం పెనవేసుకుపోయి వున్నాయి. ద్రౌపది వొక్కసారి తుళ్లిపడి లేచింది. స్నానం చేసి, మంచి వస్త్రాలు అలంకరించుకుని పాకశాల వైపు నడిచింది. వంటపాత్రలతో సువిశాల శాల కిటకిటలాడుతోంది. పాకవిశేష శేషాలు కమ్మని వాసనలు వెదజల్లుతున్నాయి. వాటి మధ్యన కొండవలె కటిక నేలపై ఆదమరచి నిద్రిస్తున్న భీమసేనుడు కనిపించాడు. ద్రౌపది భర్తను సమీపించి, ‘‘నాథా! యింత చేసిన ఈ కీచకుడు నిర్భయంగా తన మందిరానికి వెళ్లి, గుండెలపై చేయి వేసుకుని నిద్రపోతున్నాడు. నువ్వు కటిక నేలపై హాయిగా గురకలు పెడుతున్నావు. కంటికి నిదురరానిది నాకేనన్నమాట. కట్టుకున్న యిల్లాలికి నడివీధిన అంతటి అవమానం జరుగుతుండగా చూశావు కదా. అయినా, యింత సుఖంగా నిద్రిస్తున్నావంటే... అది నీ చేతకానితనం అనుకోవాలా? లేక అగ్రజుని ఆదేశానికి కట్టుబడి వున్నావా? లేక నాపై వైముఖ్యమా?’’ అనగా విని, ‘‘నీ రాకను యెవ్వరూ గమనించలేదు కదా’’ అని ఆత్రుతగా ప్రశ్నించాడు భీమసేనుడు.లేదన్నట్టు తలవూపింది ద్రౌపది. ఆమె కళ్లవెంట అశ్రుధారలు జారుతున్నాయి. వలలుడు ఆమెను దగ్గరగా తీసుకుని వూరడించాడు. తన భర్తల పరాక్రమాన్ని, యీ దుస్థితిని తలచుకుని రోదించింది. భీముని వక్షస్థలం ద్రౌపది కన్నీళ్లతో అభిషిక్తమైంది. సాధ్వీ, ఎంతటివారికైనా కాలం కలిసిరానపడు కష్టాలు తప్పవు. గడచిన కాలంలో ఎందరో నీవంటి మహాసాధ్వులు ఎన్నో హింసలు వోర్చారు. సీత, సుకన్య, దమయంతి, లోపాముద్ర ... యిలా ఎందరో విపత్తులనెదుర్కొని తరువాత సకల సుఖాలు అనుభవించలేదా? పాంచాలీ, మన అజ్ఞాతవాస దీక్ష పూర్తికావడానికి ఎక్కువ రోజులు వ్యవధి లేదు. మన కష్టాలు గట్టెక్కడానికి ఆట్టేరోజులు నిరీక్షించాల్సిన పనిలేదు. కీచకుని సంహరించడం నాకు పెద్దపనికాదు. నువ్వు సింహబలుని కోరికను అంగీకరించినట్టు నటించి, వాడిని మచ్చిక చేసుకో. తదుపరి నర్తనశాలను సంకేత స్థలంగా నిర్ణయించి, నిశిరాత్రివేళ ఒంటరిగా అక్కడికి రమ్మను. అర్ధరాత్రి అక్కడకు వచ్చిన సింహబలుని చీకటిలోనే మట్టుపెట్టి నీ పగను చల్లారుస్తాను. అజ్ఞాతవాసంలో వున్న మనకు యింతకంటె మరొక మార్గం తోచడం లేదు- అంటూ ఆమె కన్నీరు తుడిచాడు. భీముని మాటలకు ఆమె ముఖం విప్పారింది. ‘‘మన పథకాన్ని అత్యంత జాగరూకతలో నడిపించాలి. అదుగో, తెలవారడానికి ఆట్టే పొద్దులేదు. నువ్వింక బయలుదేరి వెళ్లు’’ అంటూ మాలినిని కొంతదూరం సాగనంపాడు వలలుడు.